ఆర్థికానికి అగ్రతాంబూలం

10 Jun, 2014 00:39 IST|Sakshi
ఆర్థికానికి అగ్రతాంబూలం

ప్రగతే లక్ష్యంగా ఆర్థిక సంస్కరణలు  ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
 
జీఎస్టీని తెస్తాం..  నల్లధనాన్ని రప్పిస్తాం
మోడీ ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆవిష్కరించిన ప్రణబ్
ఉగ్ర, తీవ్రవాదాలపై ఉక్కుపాదం

 
న్యూఢిల్లీ: దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలను నూతన ఎంపీలు ప్రతిఫలించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిలషించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దాన్ని పూర్తిస్థాయిలో వృద్ధి పట్టాలకెక్కించడమే కేంద్ర ప్రభుత్వ తొలి ప్రాథమ్యం కానుందని దేశ ప్రథమ పౌరుడు స్పష్టీకరించారు. ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విషయంపై ప్రధానంగా దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. ‘ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంతో పాటు ఎఫ్‌డీఐ సహా పెట్టుబడులన్నింటినీ ఇతోధికంగా ప్రోత్సహిస్తాం. అందుకోసం పారదర్శకమైన, స్నేహపూర్వకమైన పన్ను విధానాలను అనుసరిస్తాం’ అని స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కారు కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి తొలిసారిగా ప్రసంగించారు. సోమవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన సర్కారు ప్రాథమ్యాలు, లక్ష్యాలు తదితరాలను ఆయన 50 నిమిషాల పాటు వివరించారు. ‘మత హింసపై ఉక్కుపాదం మోపుతాం. అంతర్గత భద్రతను పటిష్టపరుస్తాం. ఉగ్రవాదం, తీవ్రవాదం, నేరాలు, అల్లర్లను, మహిళలపై హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం’ అని ప్రణబ్ ప్రకటించారు. మత హింస నిరోధానికి, వామపక్ష తీవ్రవాదం అదుపునకు రాష్ట్రాలను సంప్రదించిన మీదట జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ప్రకటించారు.

మైనారిటీలందరినీ దేశ ప్రగతిలో సమాన భాగస్వాములను చేస్తామంటూ హామీ ఇచ్చారు. మదర్సాలను ఆధునీకరిస్తామన్నారు. 30 ఏళ్ల తర్వాత దేశ ప్రజలు ఒకే పార్టీకి మెజారిటీ కట్టబెట్టారని గుర్తు చేశారు. ‘ఏక్‌భారత్, శ్రేష్ఠ భారత్ కోసం ఓటేశారు. వారి తెలివిడికి నా జేజేలు’ అంటూ కొనియాడారు. పేదరిక నిర్మూలనే అతి పెద్ద సవాలని, దాన్ని అధిగమించి చూపుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి తీరుతామన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీకి చెందిన అతిరథ మహారథులతో పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రణబ్ ప్రసంగాన్ని ఆద్యంతం అత్యంత శ్రద్ధతో ఆలకించారు. దేశాభివృద్ధి, సర్వ వర్గ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన రోడ్‌మ్యాప్ ఆయన మాటల్లోనే..

సంస్కరణలతో ఆర్థికరంగానికి పునరుత్తేజం కల్పిస్తాం. ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసి పెట్టుబడుల వ్యవస్థకు నూతనోత్తేజం తీసుకువస్తాం.ఉపాధి కల్పనను వేగవంతం చేసి, ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలోకి మళ్లిస్తాం. దేశీయంగా, అంతర్జాతీయంగా మన ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతాం.సహేతుకమైన పారదర్శక విధానాలను రూపొందించి అమలు చేస్తాం. పన్ను వ్యవస్థను హేతుబద్ధీకరించి పెట్టుబడులకు అనువుగా ఉండేలా సరళతరం చేస్తాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)తో పాటు అన్ని రకాల పెట్టుబడులనూ ప్రోత్సహిస్తాం.సేవలు, వస్తూత్పత్తి పన్ను (జీఎస్టీ)ను ప్రవేశపెట్టేందుకు కట్టుబడ్డాం. ఆ క్రమంలో రాష్ట్రాల్లో తలెత్తే అనుమానాలు, ఆందోళనలను నివృత్తి చేస్తాం.పర్యాటకాన్ని, వ్యవసాయాధారిత పరిశ్రమలను వృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతాం.
     
వ్యవసాయ, వ్యవసాయాధారిత ఉత్పత్తుల సరఫరాను మెరుగుపరుస్తాం. అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెటింగ్‌లను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటాం.ప్రజాపంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తెస్తాం.అవినీతి మహమ్మారి బారి నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. లోక్‌పాల్ వంటి వ్యవస్థల సాయంతో అవినీతిని రూపుమాపుతాం.విదేశాల్లో మూలుగుతున్న మన నల్లధనాన్ని రప్పిస్తాం.మత హింసను, తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు రాష్ట్రాలతో సంప్రదించి జాతీయ విధానాన్ని రూపొందిస్తాం.స్త్రీలపై నేరాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని అత్యంత కఠినంగా శిక్షిస్తాం. అన్యాయాలకు గురైన అభాగినులకు సత్వర న్యాయం దక్కేలా నేర న్యాయ వ్యవస్థను సంస్కరిస్తాం.
     
బేటీ బచావో-బేటీ పడావో (ఆడపిల్లను కాపాడదాం-చదివిద్దాం) పథకం కింద అన్ని సదుపాయాలూ కల్పిస్తాం.కోర్టులను ఆధునీకరిస్తాం. కోర్టు సిబ్బంది, న్యాయమూర్తుల సంఖ్యను రెండింతలు చేస్తాం. పెండింగు కేసులను పరిష్కరిస్తాం.ప్రజలందరికీ సాగు, తాగు నీరు కల్పించే విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. త్వరలో ‘ప్రధానమంత్రి కృషి సించాయి యోజన’ను ప్రారంభిస్తాం.పార్లమెంట్లో, అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి తీరుతాం.
 
 

మరిన్ని వార్తలు