15 రోజుల్లో నివేదిక

10 Apr, 2016 01:29 IST|Sakshi

♦ ‘పనామా’పై అధికారులకు ప్రధాని మోదీ ఆదేశం
♦ ఏప్రిల్ 4నే అధికారులతో భేటీ
 
 న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘పనామా పేపర్స్’ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించినట్లు తెలిసింది. మూడుదేశాల పర్యటన ముగించుకుని ఏప్రిల్ 4న భారత్ వచ్చిన మోదీ..  వెంటనే ఆర్థికశాఖ ముఖ్య అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ.. ఈ వివాదంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా దర్యాప్తు జరిపి 15రోజుల్లో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రధాని అధికారులను ఆదేశించారని అధికారవర్గాలు శనివారం వెల్లడించాయి. అయితే దీన్ని నల్లధనంపై వేసిన సిట్‌కు అనుసంధానం చేయకుండా.. కొందరు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ వివాదాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని.. వాస్తవాలను వీలైనంత త్వరగా తనకు తెలియజేయాలనిసూచించారు.

 ఐస్‌లాండ్ సర్కారుకు తప్పిన అవిశ్వాసం
 పనామా వివాదానికి సంబంధించి ఐస్‌లాండ్ ప్రభుత్వంపై విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ తోసిపుచ్చింది. మరోవైపు, పనామా పేపర్స్ లీక్‌నేపథ్యంలో ఎల్ సాల్వెడార్‌లోని మొసాక్ ఫొన్సెకా కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

 కాగా, పనామా పేపర్స్ లీక్ నేపథ్యంలో ఏప్రిల్ 5 నుంచి జిన్‌పింగ్‌పై వ్యతిరేక వార్తలు రాస్తున్నారనే కారణంతో ఎకనమిస్ట్, టైమ్స్ వెబ్‌సైట్లపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ద న్యూయార్క్ టైమ్స్, ద ఇండిపెండెంట్, బీబీసీ వంటి ప్రముఖ సైట్లపై చైనాలో నిషేధం కొనసాగుతోంది. ఈ సైట్ల మొబైల్‌యాప్‌లతోపాటు ట్విట్టర్, ఎఫ్‌బీ అకౌంట్లనూ రద్దుచేసింది.

మరిన్ని వార్తలు