వివాదంతో ఐఐటీ డెరైక్టర్ రాజీనామా

29 Dec, 2014 02:15 IST|Sakshi
వివాదంతో ఐఐటీ డెరైక్టర్ రాజీనామా

న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీ డెరైక్టర్ రఘునాథ్ కేఎస్ శెవ్‌గావొంకర్ రాజీనామా చేశారు. మరో రెండేళ్లకు పైగా సర్వీస్ ఉండగానే ఆయన రాజీనామా చేయడం, కేంద్ర మానవవనరుల శాఖ(హెచ్‌ఆర్‌డీ) ఒత్తిడి కారణంగానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వస్తుండటంతో ఆ రాజీనామా వ్యవహారం వివాదాస్పదమైంది. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఐఐటీ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల చైర్మన్ విజయ్ పీ భట్కర్‌కు శుక్రవారం పంపిన లేఖలో పేర్కొన్నారు.

అయితే, ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లోని కొంత భూమిని ప్రముఖ క్రికెటర్ సచిన్ తేందూల్కర్ ఏర్పాటు చేయాలనుకుంటున్న క్రికెట్ అకాడమీకి అప్పగించాలని, ఐఐటీ ఢిల్లీలో కొంతకాలం ఫాకల్టీగా ఉన్న బీజేపీ నేత సుబ్రహణ్యస్వామికి చెల్లించాల్సి ఉన్న బకాయిలు రూ. 70 లక్షలను వెంటనే చెల్లించాలని హెచ్‌ఆర్‌డీ నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం వల్లనే రఘునాథ్ ఐఐటీ ఢిల్లీ డెరైక్టర్ పదవికి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆదివారం హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ ఖండించింది.

ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఒక వివరణ లేఖను అధికారులు మీడియాకు విడుదల చేశారు. ఐఐటీ ఢిల్లీ డెరైక్టర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఆయనపై ఏ విధమైన ఒత్తిడి తేలేదని అందులో స్పష్టం చేశారు. ఆ విషయమై  మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని పేర్కొంది. క్రికెట్ అకాడమీ కోసం ఐఐటీ భూమి కోరుతూ సచిన్ తేందూల్కర్ నుంచి ఎలాంటి అభ్యర్థన లేదని పేర్కొంది. అలాగే, సుబ్రమణ్యస్వామి జీతం బకాయిల గురించి కూడా ఐఐటీ ఢిల్లీకి ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాగా, ఈ వివాదంలోకి తనను లాగడంపై సచిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు