బీజేపీ ఎంపీలకు సంఘ్ ‘క్లాస్’

30 Jun, 2014 00:43 IST|Sakshi
బీజేపీ ఎంపీలకు సంఘ్ ‘క్లాస్’

మే16.. ఆగస్టు 16ను తలపిస్తోందన్న సంఘ్
మోడీ తొలి టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేశారు: అద్వానీ

 
సూరజ్‌కుండ్ (హర్యానా): తొలిసారిగా ఎన్నికైన 161 మందికిపైగా ఎంపీలకు బీజేపీ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో రెండోరోజురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) పాల్గొంది. శిక్షణ కార్యక్రమం ముగింపు రోజైన ఆదివారం సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేశ్ సోని పాల్గొని.. కొత్త ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 16వ తేదీ.. బ్రిటిష్ పాలకులు భారత్‌ను వీడి వెళ్లిపోయిన ఆగస్టు 16(1947)ను తలపిస్తోందని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. ‘‘మీలో చాలా మందికి ఆర్‌ఎస్‌ఎస్, దాని సిద్ధాంతాల గురించి తెలుసు. సిద్ధాంతమే మన ఆత్మ. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వీడరాదు’’ అని సూచించారు. బీజేపీ చేపట్టిన శిక్షణ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి హాజరుకావడం ఇదే ప్రథమం.

 కాంగ్రెస్‌కు ప్రతిపక్ష అర్హతా దక్కలేదు: అద్వానీ

 ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత అద్వానీ(86) మాట్లాడుతూ.. ‘‘మోడీ తొలి టెస్ట్‌లో ట్రిబుల్ సెంచరీ (లోక్‌సభ ఎన్నికలల్లో ఎన్డీఏ సాధించిన సీట్లు) చేశారు. ఆయనలాంటి రాజకీయ క్రికెటర్‌ను ఇంతవరకూ నేను చూడలేదు’ అని కొనియాడారు. పదేళ్లపాటు దేశాన్ని పాలించి.. చివరికి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన అర్హత కూడా పొందలేని పార్టీని చూడదలేని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ నాయకుడు రామ్ నాయక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై.. తమ నియోజకవర్గాలతో అనుబంధాన్ని మరింత దృఢపరచుకోవాలని చట్టసభ సభ్యులకు సూచించారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తదితరులు మాట్లాడారు.

సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోండి

సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లను సమర్థంగా వినియోగించుకోవాలని బీజేపీ తమ ఎంపీలకు సూచించింది. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆదివారం సోషల్ మీడియా ప్రాధాన్యంపై చర్చ జరిగింది. ఈ మాధ్యమాన్ని అనువుగా మలచుకుని పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి సురేశ్ సోని ఎంపీలకు సూచించారు. ఈ మాధ్యమాన్ని ఉపయోగించేప్పుడు  ఏమాత్రం పొరపాటు చేసినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయని ్ఠగోయల్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఈ తరహా వెబ్‌సైట్‌ల వాడకంలో తమకు పెద్దగా అనుభవం లేదని పలువురు ఎంపీలు అన్నట్టు తెలింది. అనేకమంది ఎంపీలు వీటిని వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రాజ్యసభ, లోక్‌సభలకు మొదటిసారి ఎన్నికైన సుమారు 150 మంది ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు