విహారంలో విషాదం

2 Feb, 2016 04:14 IST|Sakshi
విహారంలో విషాదం

♦ 14 మంది విద్యార్థుల జల సమాధి  
♦ వీరిలో 10 మంది విద్యార్థినులు
 
 మహారాష్ట్రలోని మురూడ్-జంజీరా బీచ్‌లో ఘటన
 
 సాక్షి, ముంబై: ఆడుతూ పాడుతూ సాగాల్సిన విహారయాత్ర పెను విషాదాన్ని మిగిల్చింది. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మురూద్-జంజీరా తీరంలో సోమవారం 14 మంది కాలేజీ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతిచెందారు. మరొ విద్యార్థి సైఫ్ అహ్మద్ ఆచూకీ ఇంకా తెలియలేదు. మృతుల్లో 10 మంది విద్యార్థినులు ఉన్నారు. ఐదుగురు విద్యార్థినులకు కాపాడి, చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. పుణేలోని ఇనాందార్ కాలేజీలో బీఎస్సీ, బీసీఏ చదువుతున్న 116 మంది విద్యార్థులు మురూడ్-జంజీరాకు మూడు బస్సుల్లో వచ్చారు. వీరిలో కొందరు.. ఉపాధ్యాయులకు తెలియకుండా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈత కోసం సముద్రంలోకి దిగారు.

అదే సమయంలో భారీ అలలు రావడంతో నీట మునిగి కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన మరికొందరు విద్యార్థులూ మునిగిపోయారు. వీరి కేకలను విని జాలర్లు, స్థానికులు అక్కడికి పరుగున వెళ్లారు. ఐదుగురిని రక్షించి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. గల్లంతైనవారి కోసం గాలించి, 14 మృతదేహాలను బయటికి తీశారు. కోస్ట్‌గార్డ్, నేవీ హెలికాప్టర్లు, పడవలతో రాత్రి ఎనిమిది గంటల వరకు గాలింపు జరిపారు. మృతులను శిఫా కాజీ, సుమయా అన్సారీ, యూసుఫ్ అన్సారీ, సుప్రియా పాల్, ఫర్హిన్ సయ్యద్, ఇఫ్తిఖార్ శేఖ్, సాజిద్  చౌదరీ, రాజ్ తన్జినీ, స్వప్నాలి సంగత్, సమ్రిన్ శేఖ్, షఫియా అన్సారీ, రఫియా, సానా మునీర్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతివార్తతో  ఇనాందార్ కాలేజీ క్యాంపస్ శోకసంద్రంలో మునిగిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవీస్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు