తెల్లారేలోపు ముగించేశారు!

1 Oct, 2016 04:27 IST|Sakshi
తెల్లారేలోపు ముగించేశారు!

- చీకట్లోనే రెండు కిలోమీటర్ల ట్రెక్కింగ్
- లక్ష్యాన్ని చేరగానే మెరుపుదాడి.. బంకర్లు ధ్వంసం
 
 పాకిస్తాన్‌పై సర్జికల్ దాడి చేసేందుకు భారత్ వారం రోజుల ముందునుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తోటి జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్ర వాదులను మట్టుబెట్టడం, వారి కేంద్రాలను కసితీరా బద్దలు కొట్టేందుకు అద్భుతమైన ప్రణాళికతో ముందడుగేసింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో ఈ ఆపరేషన్‌ను అమలుచేసేందుకు బయలుదేరిన ప్రత్యేక బృందం సభ్యులు కూడా ‘ఉడీ’కి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో గంటలపాటు శత్రువుల కంటికి చిక్కకుండా రెండు కిలోమీటర్ల మేర పాక్ భూభాగంలో చీకట్లో కొండలు, గుట్టలు ఎక్కారు.     - సాక్షి, నేషనల్ డెస్క్
 
 చిమ్మచీకట్లో..
 ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే పాక్‌పై సర్జికల్ దాడులకు అర్థరాత్రే సరైన సమయమని భారత్ నిర్ణయించుకుంది. ప్రత్యర్థులను నిద్రలో ఉన్నప్పుడే మట్టుబెట్టాలని ప్రణాళిక రూపొందించుకుంది. అమావాస్యముందు చీకటి, దీనికి తోడు వెళ్లాల్సిన లక్ష్యం కొండలు గుట్టల మధ్యలో. ప్రత్యర్థి ఏమాత్రం అప్రమత్తమైనా.. ప్రాణాలతో బయటపడటం అసాధ్యమే. ప్రత్యర్థులు పన్నిన ఉచ్చులెక్కడున్నాయో కనిపెడుతూ.. వాటిబారిన పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే వారం రోజుల క్రితం నుంచే లక్ష్యాలను ఎలా చేరుకోవాలి? ఏయే మార్గాల్లో వెళ్లాలి? ఆపరేషన్ పూర్తయ్యేంతవరకు వ్యవహరించాల్సిన తీరుపై ప్రత్యేక బృందాలకు పరిస్థితులపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ బృందాలకు ప్రత్యేకంగా స్వీడన్ తయారీ కార్ల్ గుస్తవ్ రాకెట్ లాంచర్లు అందజేశారు. వీటి ద్వారా యుద్ధ ట్యాంకులు, బలమైన స్థావరాలను కూల్చేయవచ్చు. చీకట్లోనైతేనే ప్రత్యర్థి కోలుకునే లోపే చావుదెబ్బ కొట్టొచ్చన్నది భారత ఆర్మీ ప్లాన్.
 
 పక్కా ప్రణాళిక ప్రకారం..
 సర్జికల్‌దాడుల స్పెషలిస్టులైన ప్రత్యేక బృందంలోని కమాండోలు పూంఛ్ జిల్లాలోని నౌగామ్ సెక్టార్ ద్వారా పాక్‌లోకి ప్రవేశించారు. కొండలు, గుట్టల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎల్వోసీలో రెండు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లారు. ముందుగా వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం ఉగ్రవాద కేంద్రాలను గుర్తించి తెల్లవారుజామున 1.45 గంటలకు టార్గెట్ల వద్దకు చేరుకున్నారు. అప్పటివరకు అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. కానీ, అనుకోని ఘటన ఏమైనా జరిగితే వెంటనే చొచ్చుకెళ్లిన ప్రత్యేక బృందాలను కాపాడేందుకు జమ్మూకశ్మీర్, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లలో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. అంతా లైవ్లో గమనిస్తున్న ఉన్నతాధికారులు ఆపరేషన్‌ను విజయవంతం చేసేలా మార్గదర్శకత్వం చేశారు. లక్ష్యం ముందుకు చేరుకోవటం, ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న అధికారుల ఆదేశాలు రావటమే ఆలస్యం.. భారత కమాండో బృందాలు.. ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపుదాడి చేశాయి. ఒక్కో బంకర్లో కనీసం 10-15 మంది మిలిటెంట్లు ఉన్నారని సమాచారం. వారిని మట్టుబెట్టడంతోపాటు బంకర్లను పూర్తిగా ధ్వంసం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా