ఈ బ్యాండ్‌ వాయించడానికొస్తే మైండ్‌ బ్లాకవుద్ది

4 Jul, 2017 15:41 IST|Sakshi


న్యూఢిల్లీ: బ్యాండ్‌ బాజా భారాత్‌.. అని పేరు వినగానే పెళ్లిళ్లకు బ్యాండ్‌ మేళం వాయించే బృందమని స్ఫురిస్తుంది. కానీ ఈ పేరుగల బృందం వాయింపునకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబ సభ్యులేకాదు, పెళ్లికి హాజరయ్యే అతిథులంతా అయ్యో, వామ్మో! అంటూ అరవాల్సిందే. ఈ బృందంలోని సభ్యులు పెళ్లి మంటపాలను, పెళ్లి వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని ఎవరిని వదలిపెట్టకుండా ఖరీదైన నగలు, నట్ర, నగదు, గిఫ్టులను దోచుకుంటారు.

పర్సులను బయటకు తీసి వాటిని జేబుల్లో పెట్టేసుకొనేలోగానే వాటిలోని డబ్బును కొట్టేస్తారు. పెళ్లి కూతురు అలంకరించుకునే ఖరీదైన నెక్లెస్‌లను కూడా క్షణాల్లో మటుమాయం చేస్తారు. ఈ బ్యాండ్‌ బాజా బృందం నాయకుడు రాకా (32)ను ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో బండారం బయట పడింది. రాకా నుంచి బంగారు, వెండి నగలతోపాటు నాలుగు లక్షల రూపాయల నగదు, ఎనిమిది లక్షల రూపాయల పెళ్లి గిఫ్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ బ్యాండ్‌ గురించి రాకా వెల్లడించిన విషయాలు దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. రాకాతోపాటు మరో మహిళ నాయకత్వం వహిస్తున్న ఈ బృందంలో అంతా 9 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలే ఉన్నారు. వారంతా మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలోని గుల్ఖేరి, సుల్ఖేరి, కడియా గ్రామాలకు చెందిన వారే. 12 నుంచి 15 మంది వరకు బాలబాలికలు ఈ బృందంలో ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు సీసీటీవీ కెమేరాల ద్వారా వారిలో అరేడుగురిని గుర్తించారు. వారిని విచారించేందుకు సోమవారం ఆ గ్రామాలను సందర్శించిన డిల్లీ పోలీసు బృందానికి చుక్కలు కనిపించాయి. ఏం చేయాలో తోచక వారు చివరకు రాయ్‌గఢ్‌ జిల్లా పోలీసులను ఆశ్రయించారు. ఈ రోజు వారు అక్కడే ఉన్నారు. దొంగతనాలతో సంబంధం ఉన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు మానవ హక్కులు, బాలల హక్కుల గురించి క్షుణ్నంగా తెలుసు.



వారిని రక్షించేందుకు తల్లిదండ్రులు, ఊరు పెద్దలు ఏకమవడమే కాదు, న్యాయవాదులతో మంచి రక్షణ వలయం కూడా ఉంది. 
పోలీసులు పట్టుకునేందుకు వస్తే పిల్లలు తమ చేతులకు, కాళ్లకు తమంతట తామే గాయాలు చేసుకుంటారు. పోలీసులు గాయపర్చారంటూ గోల చేస్తారు. వారికి న్యాయవాదులు వత్తాసు పలుకుతారు. కొన్ని సందర్భాల్లో ఇంటి మొదటి అంతస్తు నుంచి తల్లిదండ్రులే తమ పిల్లలను కింద పడేసి పోలీసులు చంపేస్తున్నారంటూ అల్లరి చేస్తారని, వారికి ఊరి పెద్దలు వత్తాసు పలుకుతారని రాజ్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. ఈ మూడు గ్రామాల ప్రజలను దోపిడీలు, దొంగతనాల మీదనే బతుకుతున్నందున దొంగతనాల కోసం తమ పిల్లలను లీజుకు ఇస్తున్నారు. దగ్గరదగ్గరుండే ఈ గ్రామాల్లో 600 ఇళ్లు, దాదాపు ఐదు వేల జనాభా ఉంది. 
 
పిల్లల అందచందాలు, చలాకీతనం ఆధారంగా లీజు రేట్లు ఉంటాయట. ఏడాదికి రెండు లక్షల నుంచి తొమ్మిది లక్షల రూపాయల వరకు చెల్లించి నేరస్థులు వీరిని లీజుకు తీసుకుంటున్నారు. ఏడాదిలో రెండు, మూడు వాయిదాల్లో ఆ లీజు మొత్తాన్ని పిల్లల తల్లిదండ్రులకు చెల్లిస్తారు. లీజులో కొంత వాటా గ్రామ పెద్దలకు వెళుతుంది. న్యాయవాదులకు మాత్రం కేసును బట్టి చెల్లింపులు ఉంటాయట. 
 
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం ఈ పిల్లలను లీజుకు తీసుకొచ్చిన బ్యాండ్‌ బాజా భారత్‌ వారికి నెల రోజులపాటు చోర విద్యలో శిక్షణ ఇచ్చింది. దొంగతనాలకు వెళ్లేది పెద్దింటి పెళ్లిళ్లకు కనుక ఖరీదైన దుస్తులు వేసుకోవడం, స్టైల్‌గా ఉండడం కూడా నేర్పింది. ఖరీదైన చాక్లెట్లు, స్టాటర్లు తింటూ పెళ్లి వారితో ఎలా కలపుగోలుగా తిరిగాలో కూడా చెప్పింది. అద్దె ఇళ్లలో ఉంచి మంచి ఆహారంతో వీరిని పోషిస్తున్న ముఠా సభ్యులు ఖరీదైన పెళ్ళిళ్ల మంటపాల వద్ద స్వయంగా వదిలేసి వెళతారు. కొన్ని సందర్భాల్లో ఎప్పటికప్పుడు చోరీ చేసిన వస్తువులను తరలించేందుకు పెళ్లి మంటపాలకు సమీపంలోనే వ్యాన్లలో నిరీక్షిస్తారు. మంచి ఆహారంతోపాటు, మంచి వసతి కల్పించడం, తరచుగో తమ తల్లిదండ్రులతో మొబైల్‌ ఫోన్లలో మాట్లాడించడం వల్ల పిల్లలు నిక్షేపంగా ముఠాతోనే ఉంటున్నారు.
మరిన్ని వార్తలు