పీఎన్‌బీ స్కామ్‌ : సమాంతర విచారణకు కేంద్రం నో

16 Mar, 2018 16:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీ కుంభకోణం కేసులో సమాంతర విచారణ, కోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టడం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ 12,000 కోట్ల పీఎన్‌బీ స్కాం విచారణ పురోగతిని సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని సీబీఐకి సుప్రీం కోర్టు చేసిన సూచనను కేంద్రం తోసిపుచ్చింది. ఈ కేసుపై దర్యాప్తు సంస్థలు విచారణను ప్రారంభించకముందే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలతో ప్రజలు న్యాయస్ధానాలను ఆశ్రయించడం పట్ల అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ విస్మయం వ్యక్తం చేశారు. పిల్‌ దాఖలు చేస్తూ విచారణ పురోగతి వివరాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడం న్యాయసమ్మతమేనా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం కన్విల్కార్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ను ప్రశ్నించారు.

ఇలాంటి సందర్భాల్లో న్యాయస్ధానాలు సమాంతర విచారణ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వాలను ఆయా పత్రాలను కోరడం సముచితమన్నారు. పిటిషనర్‌ సహేతుకమైన కారణాలను చూపకుంటే ఇలాంటి పిటిషన్‌లను న్యాయస్ధానాలు ఎందుకు ప్రోత్సహించాలని అటార్నీ జనరల్‌ వాదించారు. ఈ తరహా పిటిషన్‌లు దర్యాప్తు సంస్థల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని వేణుగోపాల్‌ సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించారు.

పీఎన్‌బీ స్కామ్‌పై స్వతంత్ర విచారణ చేపట్టాలని, డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది వినీత్‌ దందా దాఖలు చేసిన పిటిషన్‌ను అటార్నీ జనరల్‌ వ్యతిరేకించారు. పీఎన్‌బీ స్కామ్‌కు సంబంధించి జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ, ఆయన బంధువు గీతాంజలి జెమ్స్‌ అధినేత మెహుల్‌ చోక్సీలపై సీబీఐ, ఈడీలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు