శశికళకు వీఐపీ ట్రీట్‌మెంట్: భారీగా ముడుపులు!

13 Jul, 2017 13:38 IST|Sakshi
శశికళకు వీఐపీ ట్రీట్‌మెంట్: భారీగా ముడుపులు!

బెంగళూరు: జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక సదుపాయాల కోసం రూ.2 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో ఉన్న శశికళకు ఎలాంటి  ప్రత్యేక వంటగది వసతి కల్పించలేదని, కోర్టు ఉత్తర్వులు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. సాధారణ ఖైదీలకు ఇచ్చే సదుపాయాలే ఆమెకు కల్పిస్తున్నామని చెప్పారు.

శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ డీ రూప.. డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది. అయితే శశికళకు వీఐపీ ట్రీట్‌మెంట్ అంటూ ఆ లేఖలో పేర్కొన్న ఆరోపణలను సత్యనారాయణ ఖండించారు. ముడుపులు తీసుకున్నట్లు డీఐజీ రూప స్వయంగా గుర్తిస్తే అప్పుడు ఈ విషయంపై చర్చించాల్సి ఉందన్నారు. నేనే డబ్బులు తీసుకున్నట్లు డీఐజీ రూప భావిస్తే నాపై విచారణకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు.

మరోవైపు ఏడాదిన్నర లీవ్ తర్వాత బాధ్యతలు చేపట్టిన తనకు పరప్పన అగ్రహార జైలులో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసిందని రూప చెబుతున్నారు. ఆ జైల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే విచారణకు ఆదేశించడమే ఏకైక మార్గమని రూప అభిప్రాయపడ్డారు. స్టాంప్ పేపర్ స్కాంలో ఇరుక్కుని జైలుశిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీమ్ తెల్గీకి కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నట్లు జైళ్లశాఖ డీఐజీ రూప వివరించారు.