‘ఈసీలో అసమ్మతి తెలుసుకునే హక్కు ఉంది’ 

6 May, 2019 01:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్షన్‌ కమిషనర్‌ అసమ్మతి వ్యక్తం చేస్తే దాన్ని రికార్డు చేయాలని, ఈసీ ఇచ్చిన ఉత్తర్వు ఏకగ్రీవమా కాదా తెలుసుకునే హక్కు ఫిర్యాదుదారుకు ఉంటుందని ఇద్దరు మాజీ ప్రధాన ఎన్నికల అధికారులు చెప్పారు. ప్రధాని మోదీకి సంబంధించిన కనీసం 3 కేసుల్లో, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు సంబంధించిన ఒక కేసులో క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని ఎలక్షన్‌ కమిషనర్లలో ఒకరు వ్యతిరేకించినట్లు వార్తలు రావడం వివాదాస్పదమయ్యింది. ప్రచారంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు గుర్తించినా గుర్తించకపోయినా సరే దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఈసీ కార్యదర్శి ఫిర్యాదికి తెలియజేయాలని మాజీ సీఈసీ ఒకరు చెప్పారు. అది మెజారిటీ నిర్ణయమా? లేక ఏకగ్రీవమా అనేది కూడా స్పష్టంగా చెప్పాలన్నారు.

అసమ్మతికి సంబంధించిన ప్రతిని పంపాల్సిన అవసరం లేదని, కానీ ఎవరు నిర్ణయాన్ని వ్యతిరేకించారో తెలుసుకునే హక్కు మాత్రం ఫిర్యాదికి ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల తరహాలోనే అసమ్మతి విషయాన్ని ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని మరో సీఈసీ చెప్పారు. మోదీ వార్ధా, లాతూర్‌లో చేసిన ప్రసంగాలకు, అమిత్‌ షా నాగపూర్‌లో ప్రసంగానికి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని ఎన్నికల కమిషనర్లలో ఒకరు వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. ఏదేని ఒక అంశంపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఎలక్షన్‌ కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయం వ్యక్తమయినప్పుడు, మెజారిటీ ఆధారంగా దానిపై నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ చట్టం–1991 స్పష్టం చేస్తోంది.  

మరిన్ని వార్తలు