ముస్లిం దేశాల సపోర్ట్ కూడా పాక్‌కు లేదు

25 Sep, 2016 08:47 IST|Sakshi
ముస్లిం దేశాల సపోర్ట్ కూడా పాక్‌కు లేదు

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ భారత్ను దొంగదెబ్బ తీస్తున్న పాకిస్తాన్‌పై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ స్పందించారు. పాకిస్తాన్‌తో యుద్ధం అంత మంచిది కాదని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్పై దౌత్యపరమైన చర్యలు ఉండాలని.. అంతర్జాతీయంగా భారత్ ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించడం మంచిదని నట్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. 56 సంవత్సరాలనుంచి సవ్యంగానే సాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో యుద్ధం అంత సులభం కాదని.. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తుందని నట్వర్‌ సింగ్ హెచ్చరించారు. ఇరు దేశాలకు అణ్వాయుధ సామర్థ్యం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడంలో విజయం సాధించామని.. చివరికి ముస్లిం దేశాలు కూడా పాక్ను సపోర్ట్ చేయలేదని ఇటీవల ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్కు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని.. దీనికి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అని విమర్శించారు. ఎల్‌ఓసీని అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలని నట్వర్ సింగ్ అన్నారు.
 

మరిన్ని వార్తలు