'నన్ను ఒక పశువులా హింసించారు'

13 May, 2016 09:36 IST|Sakshi
'నన్ను ఒక పశువులా హింసించారు'

న్యూఢిల్లీ: పాకిస్థాన్తో సరిహద్దు పంచుకొని ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. ముఖ్యంగా గురుదాస్ పూర్ జిల్లాలోని దాద్వాన్ గ్రామం సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ పేదలు ఎక్కువ. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు ఎన్నో. నిత్యం పేదరికంలో బతికే వారికి అనూహ్యంగా ఒక పని దొరికి అది కూడా దేశానికి సేవ చేసే పని అయితే. అధికారిక గుఢాచారులు చేసే పని తామే చేయాల్సి వస్తే ఎవరు మాత్రం కాదంటారు.

ఇలా గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన ఎంతోమంది పేదవారు.. తమపైనే ఆధారపడి బతికే కుటుంబాలను విడిచిపెట్టి రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) కోసం పనిచేసేందుకు కదిలారు. వీరు చేయాల్సిన పని ఏంటంటే పాకిస్థాన్ వెళ్లి అక్కడ కొన్ని ఫొటోలు తీసుకొని రావడం. బ్రిడ్జీలు, రహదారులు, ముఖ్యమైన ప్రదేశాల వీడియోలు పట్టుకురావడం. ఒక్కొక్కరు మూడు రోజులపాటు వెళ్లి రావాల్సి ఉంటుంది. ఇందుకుగానీ, రా వింగ్ వారికి చెల్లించే మొత్తం రూ.3000 వేలు. అయితే, ఇలా వారిని వాడుకుంటున్న రా అధికారులు వారు కష్టాల్లో పడినప్పుడు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే..

దానియెల్ మసియా అనే ఓ వ్యక్తి ఉన్నాడు. అతడు సైకిల్ రిక్షా తొక్కుతూ రోజుకు 150 సంపాధించేవాడు. ఇతడు రా కోసం స్పై ఏజెంట్ గా పనిచేశాడు. కనీసం పన్నెండుసార్లు పాక్ ను సందర్శించి అక్కడి నుంచి ఎంతో విలువైన సమాచారం ఇచ్చాడు. కానీ, అతడిని పాక్ అధికారులు అరెస్టు చేసినప్పుడు మాత్రం రా అధికారుల నుంచి అతడికి గానీ, అతడి కుటుంబానికి గానీ ఎలాంటి సాయం అందలేదు. నాలుగేళ్ల తర్వాత విడుదలై వచ్చాడు. ఈ నాలుగేళ్లపాటు అతడి కుటుంబం పిల్లలు అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య గడిపింది. అతడికి కనీస సహాయం కూడా ఇప్పటికీ అందడం లేదు. కానీ, అతడిని పాక్ అధికారులు ఎంత వేధించినా వారికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు.

ఇక డేవిడ్(50)అనే మరో వ్యక్తి.. ఇతడు కూడా ఇదే పనిపై వెళ్లి పోలీసులకు చిక్కాడు. వారి చేతుల్లో నరకం అనుభవించి విడుదలయ్యాడు. కనీసం అతడికి అయిన గాయాలకు, మెడికల్ ఖర్చులకు ఎవరి నుంచి రూపాయి సాయం అందలేదు. ఇక సునీల్ అనే మరో వ్యక్తి కూడా ఈ విషయంపై సమాధానం చెబుతూ తనకు గుఢాచారిగా ఉండటం అంటే ఇష్టమని అందుకే వెళ్లి తాను కూడా రాకు అనుబంధంగా పనిచేశానని, తనను జంతువును హింసించినట్లే హింసించారని.. ప్రస్తుతం పక్షవాత సమస్య కూడా వచ్చిందని.. కనీసం పెన్షన్ లాంటి సౌకర్యం కూడా అందకపోవడం తమ దౌర్భాగ్యం అని వాపోయాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రాకు సహాయంగా పనిచేసే ఎంతోమందిది ఇప్పుడు ఇదే బాధ.

మరిన్ని వార్తలు