క‌రోనా సోకిన వ్య‌క్తి ఫోన్ దొంగిలించిన వైనం

20 Jun, 2020 09:34 IST|Sakshi

గువాహ‌టి  : క‌రోనా రోగులున్న హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర్లో కానీ, పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తుల ద‌రిదాపుల్లోకి వెళ్లాల‌న్నా సాధార‌ణంగా భ‌య‌ప‌డ‌తాం . అలాంటిది ఓ దొంగ మాత్రం ఏకంగా ఐసోలేష‌న్ వార్డుకే వెళ్లి కోవిడ్ సోకిన వ్య‌క్తి  ఫోన్‌ను దొంగిలించాడు. ఈ ఘ‌ట‌న అసోంలోని చిరాంగ్ జిల్లా జెఎస్‌ఎస్‌బి సివిల్ హాస్పిటల్‌లో సోమ‌వారం చోటుచేసుకోగా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. నిందితుడుని 22 ఏళ్ల బ‌ర్మ‌న్‌గా గుర్తించిన పోలీసులు వెంట‌నే అదుపులోకి తీసుకొని క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. ఐసోలేషన్ వార్డ్ లోపలికి వెళ్ళడానికి ఎవరైనా ధైర్యం చేస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు అని ఆసుప‌త్రి  సూపరింటెండెంట్ మనోజ్ దాస్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. హాస్పిట‌ల్‌లో మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్యలు చేప‌డ‌తామ‌ని తెలిపారు. (60వేల తేనెటీగలు.. దాదాపు 4గంటలకు పైగా.. )

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..బ‌ర్మాన్ చిన్న చిన్న చోరీల‌కు పాల్ప‌డుతూ జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ్డాడు. అయితే కరోనా కార‌ణంగా చేతిలో స‌రిగ్గా డ‌బ్బు చాల‌క‌పోవ‌డంతో ఏకంగా ఐసోలేష‌న్ వార్డుకే గురిపెట్టాడు. క‌రోనా కాలంలోనూ వృత్తి ధ‌ర్మాన్ని విస్మ‌రించ‌కూడ‌దనుకున్నాడో కానీ ద‌ర్జాగా వెళ్లి స్మార్ట్ ఫోన్ దొంగిలించాడు. ఈ త‌తంగం అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. హాస్పిట‌ల్‌కి 15 కిలోమీట‌ర్ల దూరంలోనే బ‌ర్మాన్ నివ‌సిస్తున్న‌ట్లు కనుగొన్న పోలీసులు వెంట‌నే అదుపులోకి తీసుకొని క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. ర‌క్త న‌మూనాలు సేక‌రించ‌గా, ఫ‌లితాలు ఇంకా వెలువ‌డాల్సి ఉంది. అయితే అత‌ను ఎవ‌రెవ‌రిని క‌లిశాడు అన్న వివ‌రాల‌ను సేక‌రిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. (ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఇసుక మాఫియాపై నిఘా )


 


 

మరిన్ని వార్తలు