‘మూడో బిడ్డను కంటే ఓటు హక్కు రద్దు చేయాలి’

26 May, 2019 16:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జనభాను నియంత్రించడానికి భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యోగా గురువు రాందేవ్‌ బాబా అన్నారు. దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఆదివారం ఆయన హరిద్వార్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏ మతానికి చెందిన వారైనా సరే అధిక సంతానాన్ని కనకూడదని ఆయన సూచించారు.

‘భారత జనాభా మరో 50 ఏళ్ల పాటు 150 కోట్లకు మించకూడదు. అంతకు మించి జనాభాకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి మనం సిద్ధంగా లేము. దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి. ఒక వేళ వారు మూడో బిడ్డను కంటే.. ఆ బిడ్డను ఓటు హక్కుకు దూరం చేసేలా చట్టం రూపొందించాలి. అలాగే, అతడు\ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి. ఎటువంటి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలి’  అని రాందేవ్‌ సూచించారు. 

అలాగే మన దేశంలో గోవధలపై పూర్తిగా నిషేధం విధించాన్నారు. అలాంటప్పుడే ఆవుల అక్రమ రవాణాదార్లు, గోరక్షకులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగిపోతాయని రాందేవ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు