భారత్‌లో మూడో మరణం 

18 Mar, 2020 02:15 IST|Sakshi

ముంబైలో కోవిడ్‌–19తో మృతి చెందిన 63 ఏళ్ల వ్యక్తి

భారత్‌లో ఇప్పటివరకు 137 కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో మంగళవారం మూడో కరోనా మరణం నమోదైంది. ముంబైలో 63 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్‌ బారిన పడి మరణించారు. ఇటీవల దుబాయ్‌ వెళ్లి వచ్చిన ఆ వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 39 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో కేరళ(26 కేసులు) ఉంది. హరియాణా, యూపీలో చెరో 15, ఢిల్లీలో 8, లద్దాఖ్‌లో 6, కశ్మీర్‌లో 3 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి కోవిడ్‌ బాధితుల సంఖ్య 137కి పెరిగింది. వాటిలో సోమవారం రాత్రి నుంచి 12 కేసులు నమోదవడం గమనార్హం. ఈ 137 మందిలో 24 మంది విదేశీయులున్నారు. కర్ణాటకలోని కల్బుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ కోవిడ్‌తో మరణించడం తెల్సిందే. ముంబైలో మంగళవారం మరణించిన వ్యక్తి భార్యకు కరోనా వైరస్‌ సోకింది. ఆమె కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొత్త కేసుల్లో రెండు నోయిడాలో, రెండు బెంగళూరులో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన రెండు కేసులతో కలిపి కర్ణాటకలో నమోదైన కేసుల సంఖ్య 11కి పెరిగింది. అలాగే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకి, చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 14 అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనా సోకిన 137 మందితో సన్నిహితంగా ఉన్న దాదాపు 52 వేల మందిని గుర్తించామని, వారిని ఐసోలేట్‌ చేసి, వైద్య పరీక్షలు జరుపుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాజిక పరిశీలన, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడం సహా కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయాలని, సందర్శకుల పాస్‌లను రద్దు చేయాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఫ్లూ లక్షణాలున్న వారిని తక్షణమే వేరుగా ఉంచి, నిర్ధారణ పరీక్షలు జరపాలని సూచించింది. అనవసర పర్యటనలను రద్దు చేసుకోవాలని, వీలైన ప్రతీసారి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సమావేశాలు నిర్వహించాలని అధికారులను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశించింది. ఫ్లూ లక్షణాలున్నవారికి సెలవుల మంజూరులో అలసత్వం చూపొద్దంది.

ఎయిడ్స్‌కు వాడే మందులు 
కోవిడ్‌ సోకినవారికి ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు వాడే యాంటీవైరల్‌ ఔషధాలైన లోపినవైర్, రొటినవైర్‌ కాంబినేషన్‌ను ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ వైద్యులకు సూచించింది. ఒక్కోకేసు తీవ్రత, లక్షణాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. 60 ఏళ్ల వయసు దాటిన, మధుమేహం, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు ఉన్న హై రిస్క్‌ గ్రూప్‌లో ఉన్నవారికి లోపినవైర్, రొటినవైర్‌ కాంబినేషన్‌ ఇవ్వాలని సూచించింది. ‘క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ కోవిడ్‌–19’ పేరుతో మంగళవారం ఒక మార్గదర్శక ప్రకటన విడుదల చేసింది. ఎయిమ్స్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఈ మార్గదర్శకాలను రూపొందించారు. లోపినవైర్, రొటినవైర్‌ కాంబినేషన్‌ను హెచ్‌ఐవీ చికిత్సకు వాడతారు.

మరిన్ని వార్తలు