చనిపోతా.. అనుమతివ్వండి

18 May, 2018 11:07 IST|Sakshi
కేరళకు చెందిన థర్డ్‌ జెండర్‌ సుజీ (ఫొటో కర్టెసీ : ద న్యూస్‌ మినిట్‌)

థర్డ్‌జెండర్‌ ఆవేదన

తిరువనంతపురం : గౌరవప్రదమైన జీవితం పొందలేకపోతున్న కారణంగా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ థర్డ్‌ జెండర్‌ త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. త్రిసూరుకు చెందిన 51 ఏళ్ల సుజీ అనే వ్యక్తి తాను థర్డ్‌ జెండర్‌నని పేర్కొన్నారు. ఈ కారణంగానే తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పేదరికం, ఆకలితో అలమటించడం కన్నా చచ్చిపోవడమే ఉత్తమం. ఆకలితో అలమటిస్తూ నేను బతకలేను. అందుకే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. కారుణ్య మరణం పొందేలా నాకు అనుమతి ఇవ్వండి’ అని లేఖలో సుజీ పేర్కొన్నారు.

ఉపాధి కల్పించమని వేడుకున్నా...
నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన సుజీ కొన్నాళ్ల పాటు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశారు. కానీ ఆమె గురించి అసలు నిజం తెలియడంతో ఆస్పత్రి వర్గాలు లింగ నిర్థారణ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అందుకు సుజీ నిరాకరించడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో సుజీ కేరళకు తిరిగి వచ్చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో కాలికట్‌ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో నర్సింగ్‌ పూర్తి చేసిన తనకు ఉద్యోగం కల్పించాల్సిందిగా త్రిసూర్‌ కలెక్టర్‌కు మూడుసార్లు లేఖలు రాశారు. కానీ కలెక్టర్‌ నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. దీంతో ఆవేదన చెందిన సుజీ.. ఈసారి తనకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతివ్వాలంటూ లేఖ రాశారు.

తండ్రి మరణంతో కుటుంబానికి దూరంగా...
కేరళలోని త్రిప్రాయర్‌కు చెందిన సుజీ తన తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులతో కలిసి జీవించేవారు. బాల్యంలో అందరూ తన గురించి హేళనగా మాట్లాడుతున్నప్పటికీ తండ్రి సహకారంతో పాఠశాల విద్యతో పాటు, నర్సింగ్‌ కూడా పూర్తి చేశారు. అయితే తండ్రి మరణించిన తర్వాత కుటుంబం సుజీని ఇంటి నుంచి వెలివేసింది. 1989లో ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన సుజీ.. అక్కడ సంపాదించిన కొద్దిపాటి సొమ్ముతో కేరళలోని ఇడమట్టంలో చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ థర్డ్‌ జెండర్‌ అనే కారణంగా ఆమెకు ఎక్కడా ఉద్యోగం లభించలేదు.

సహాయం కాదు..ఉద్యోగం కావాలి
కారుణ్య మరణం గురించి సుజీ కలెక్టర్‌కు లేఖ రాసిన విషయం మీడియాలో ప్రచారం అయింది. ఇందుకు స్పందించిన పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వేత్తలు ఆమెకు ఎందుకు ఉద్యోగం నిరాకరిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సుజీ.. ‘యునైటెడ్‌ నర్స్‌ అసోసియేషన్‌ నాకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. శుక్రవారంలోగా నా ఇంటికి చెక్కు కూడా పంపిస్తామని తెలిపింది. అయితే నాకు కావాల్సింది డబ్బు కాదు. గౌరవప్రదంగా జీవించడానికి ఉద్యోగం కావాలి. ఎంతో మంది నాకు ఉద్యోగం కల్పిస్తామని చెప్తున్నారే తప్ప.. ఆ విషయంగా నన్ను ఎవరు సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు