భారీ వర్షాలకు 13 మంది మృతి

11 Jun, 2018 15:09 IST|Sakshi
కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు

సాక్షి, తిరువనంతపురం : నైరుతి రుతుపవనాల తాకిడితో కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొద్దిరోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మరణించారు. రుతుపవనాలు బలపడి వారాంతంలో తీవ్రతరమవడంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని స్ధంభింపచేశాయి. వర్షాలతో పాటు పెనుగాలులు వీస్తుండటంతో భారీ నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.

భారీ వర్షాలు, గాలుల కారణంగా చెట్లు నేలకొరగడం, విద్యుదాఘాతంతో ఎక్కువ మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ఇడుక్కి, వైనాడ్‌ జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయని, జిల్లాలోని కొండ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందని అధికారులు వెల్లడించారు. వైనాడ్‌లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని కలిపే అప్రోచ్‌ రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. విద్యుత్‌ కేబుళ్లపై వృక్షాలు కూలడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు కూలడంతో దాదాపు 20కి పైగా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రాజధాని తిరువనంతపురంలోనూ రోడ్లు జలమయం కావడంతో పాటు రహదారులపై చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పరిస్థితిని సమీక్షించేందుకు 14 జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ప్రారంభించారు. కేరళలో ఈనెల 13 వరకూ భారీ వర్షాలతో పాటు పెనుగాలులు వీస్తాయని రాష్ట్ర వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు