భార్య కోసం సైకిల్‌పై ఎనిమిది దేశాలు..

14 Feb, 2016 18:59 IST|Sakshi
భార్య కోసం సైకిల్‌పై ఎనిమిది దేశాలు..

స్టాక్‌హోమ్: ప్రేమైక జీవన సౌందర్యానికి సరిపోలిన ప్రతీక వారి ప్రేమ. ప్రేమించి పెళ్లి చేసుకున్న విదేశీ యువతిని దక్కించుకోవడాని సైకిల్‌పై ఏకంగా ఎనిమిది దేశాలను దాటిన ఎల్లలు ఎరుగని ప్రేమికుడు ఆ భారతీయుడు. ఆయన ఒడిశా రాష్ట్రానికి చెందిన డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ మహానందియా. ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విదేశీ వనిత స్వీడన్‌కు చెందిన చార్లోటి వాన్ షెడ్విన్. వారి ప్రేమాయణం ప్రారంభమైంది 1975లో.


 అప్పుడు లండన్‌లో చదువుతున్న 19 ఏళ్ల చార్లోటి ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ కారణంగా ఢిల్లీ వచ్చారు. అదే సమయంలో ఢిల్లీలోని ‘కాలేజ్ ఆఫ్ ఆర్ట్’లో ప్రద్యుమ్న చదువుతున్నారు. వారిద్దరికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. పెళ్లి వరకు కూడా వెళ్లింది. ఒడిశాలోని దెంకనల్‌లో చేనేత కుటుంబానికి (అక్కడ అంటరాని కుటుంబం) చెందిన ప్రద్యుమ్నా కాపురం కోసం చదువును మధ్యలో వదిలి పెట్టలేక స్వీడన్ వెళ్లలేకపోయారు. స్వీడన్ రాజకుటుంబానికి చెందిన చార్లోటి ఎక్కువ కాలం భారత్‌లో ఉండలేకపోయారు. 1978లో చార్లోటి స్వదేశమైన స్వీడన్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి నాలుగేళ్ల వరకు వారి కాపురం ప్రేమ లేఖలకే పరిమితమైంది.


 ప్రద్యుమ్నను స్వీడన్‌కు రావాల్సిందిగా చార్లోటి ఆయన్ని కోరారు. అందుకు తన వద్ద డబ్బులు లేవని, తనది పేద కుటుంబమన్న విషయం తెలుసుకదా! అని ప్రద్యుమ్న సమాధానమిచ్చారు. ఆ తర్వాత తాను విమాన టిక్కెట్లు పంపిస్తానంటూ పలుసార్లు ఆమె కోరారు. అందుకు ప్రద్యుమ్న తిరస్కరించారు. తన స్వశక్తితోనే స్వీడన్ రావాలన్నది తన తాపత్రయం, తన లక్ష్యమని చెప్పారు. ప్రద్యుమ్న తన చదువు ముగించుకొని స్వీడన్ బయల్దేరడానికి నాలుగేళ్లు పట్టింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి వస్తువులను అమ్మేయగా వచ్చిన డబ్బుతో ఓ సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కొని ఢిల్లీ నుంచి బయల్దేరారు.


 మార్గమధ్యంలో పలు సార్లు బైక్ రిపేర్ వచ్చింది. అయినా మొండి పట్టుదలతో ముందుకేసాగారు. బండి మరమ్మతులకు చాలినన్ని డబ్బులు లేకపోవడంతో  ఆ బైక్‌ను అమ్మేసి ఓ కొత్త సైకిల్‌ను కొనుక్కొని దానిపై లక్ష్యంవైపు దూసుకెళ్లారు. ఆయన ప్రయాణం అఫ్ఘానిస్తాన్, ఇరాన్, టర్కీ, బల్గేరియా, యుగోస్లావియా, జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్‌ల మీదుగా స్వీడన్‌వరకు సాగింది. మార్గమధ్యంలో ఇమ్మిగ్రేషన్ చెకప్‌ల కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆకలిదప్పులను లెక్కచేయకుడా సాగిన ఆయన సైకిల్ యాత్ర నాలుగు నెలల, మూడు వారాలకు స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ చేరుకుంది. అక్కడ నుంచి చార్లోటి ఆయన్ని తీసుకొని తన నివాసానికి వె ళ్లారు. ఎంత ప్రేమింటే ఇంత సాహసం చేస్తారనకున్న ఆమె తల్లిదండ్రులు కూడా ప్రద్యుమ్నను తమ అల్లుడిగా అంగీకరించారు. అక్కడికి వెళ్లాక వారు పెళ్లి మళ్లీ చేసుకున్నారు. చార్లోటి తన భర్త మీదున్న ప్రేమానురాగాలకు గుర్తుగా తన పేరును చారులతగా మార్చుకున్నారు.


 తన ప్రేమయాత్రకు గుర్తుగా ప్రద్యుమ్న తన అప్పటి సైకిల్‌కు ఆకుపచ్చ లతలుచుట్టీ భద్రంగా దాచుకున్నారు. వారికిప్పుడు ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ అరుదైన భార్యాభర్తలుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ప్రద్యుమ్న ప్రస్తుతం స్వీడన్ తరఫున భారత్‌తో కళలు, సాంస్కృతిక సంబంధాల అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. వీరి ప్రేమగాథను సత్యనారాయణ పాత్రి అనే సోషల్‌వెబ్‌సైట్ యూజర్ ‘ఫేస్‌బుక్’లో పోస్ట్ చేయగా  లక్షలాది మంది వీక్షిస్తున్నారు. పరస్పరం షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రేమ కథ ఆధారంగా మంచి హాలివుడ్ లేదా బాలివుడ్ సినిమాను తీయవచ్చని కొంతమంది సూచనలు కూడా ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు