'ఎందుకు తీసుకోవాలి.. ఇదేం సినిమా కాదు?'

12 Apr, 2016 12:15 IST|Sakshi
'ఎందుకు తీసుకోవాలి.. ఇదేం సినిమా కాదు?'

న్యూఢిల్లీ: కరువు సమస్యలపై సరిగా స్పందించని రాష్ట్ర ప్రభుత్వాలను  సుప్రీంకోర్టు గట్టిగానే మందలిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు మరోసారి హర్యానా, కేంద్ర ప్రభుత్వాలకు కలిపి ఛీవాట్లు పెట్టింది. ఇదేమైనా సినిమానా అంటూ వ్యాఖ్యానించింది. హర్యానాలో నెలకొన్న కరువు పరిస్థితులపై వివరణ ఇవ్వాలంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఆ వివరాలను సుప్రీంకోర్టు కోరింది.

అయితే, హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అసంపూర్ణంగా ఉన్న అఫిడవిట్ సమర్పించింది. అందులో పూర్తి వివరాలు ఇవ్వలేదు. దీంతో దీనిపై మండిపడిన సుప్రీంకోర్టు..'మేం ఎందుకు ఈ అసంపూర్ణంగా ఉన్న అఫిడవిట్ తీసుకోవాలి? మీరు ఇచ్చిన అఫిడవిట్లో మేం తనిఖీ చేయాల్సిన వివరాలు లేవు.. మేం మీ అఫిడవిట్ను స్వీకరించడం లేదు. ఇదేం సినిమాకాదు' అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. మనం చర్చించేది ఏ విహారయాత్ర గురించో.. రోడ్డు నిర్మాణాల గురించో కాదు.. ఎంతో తీవ్రమైన కరువు సమస్య గురించి, ప్రజల ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించకుంటే ఎలా అని సుప్రీంకోర్టు నిలదీసింది.

మరిన్ని వార్తలు