నోటీసులపై సమాధానం వినకుండానే..!

30 Dec, 2016 23:30 IST|Sakshi
నోటీసులపై సమాధానం వినకుండానే..!

లక్నో: సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌.. కుమారడు అఖిలేష్‌ యాదవ్‌తో పాటు సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాంగోపాల్‌ యాదవ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

(చదవండి : ములాయం కుటుంబంలో ఏం జరిగింది? )


పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని రాంగోపాల్‌ యాదవ్ పేర్కొన్నారు. మా ఇద్దరికీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చాక సమాధానం వినకుండానే పార్టీ నుంచి ఎలా బహిష్కరిస్తారంటూ మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రశ్నించారు. పార్టీ అధినేతనే ఇలాంటి రాజ్యాంగ విరుద్దమైన చర్యకు పాల్పడితే ఎలా అని రాంగోపాల్‌ యాదవ్‌ వాపోయారు. తొందరలోనే ప్రజల్లో ఎవరికి ఎంత ఆదరణ ఉందో తెలుస్తుందన్న ఆయన.. జనవరి 1న రాంమనోహర్‌ లోహియా యూనిర్సిటీలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.