ఈ సమావేశాల్లో జీఎస్టీ లేనట్టే!

19 Dec, 2015 01:19 IST|Sakshi
ఈ సమావేశాల్లో జీఎస్టీ లేనట్టే!

అన్సారీ అఖిలపక్ష భేటీ.. మిగతా బిల్లులకు విపక్షాల ఓకే
 
 న్యూఢిల్లీ: రాజ్యసభ నిర్వహణలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ శుక్రవారం అఖిల పక్ష భేటీ నిర్వహించారు. అయితే, ఆ భేటీలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)పై ఎలాంటి ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు కానీ, ముఖ్యమైన ఇతర బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అంగీకరించాయి. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్నాయి. శీతాకాల సమావేశాలు ఈ నెల 23తో ముగుస్తున్న నేపథ్యంలో.. ఆ లోపు ఎస్సీ, ఎస్టీ(అత్యాచార నిరోధక) సవరణ బిల్లు, అప్రోప్రియేషన్ బిల్లులు, హైజాకింగ్ వ్యతిరేక బిల్లు, ఆటమిక్ ఎనర్జీ సవరణ బిల్లు, వాణిజ్య కోర్టుల ఆర్డినెన్స్ బిల్లు, మధ్యవర్తిత్వ సవరణ బిల్లు.. తదితర బిల్లుల ఆమోదం పొందేందుకు సహకరిస్తామని విపక్షాలు హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఈ అఖిల పక్ష భేటీలో కొత్తగా చర్చించిందేమీ లేదని, బీఏసీ సమావేశంలో చర్చించిన అంశాలనే ఇక్కడా ప్రస్తావించారని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. జీఎస్టీపై భేటీలో చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏకాభిప్రాయం వ్యక్తమైన బిల్లుల గురించి చర్చించామన్నారు. సుహృద్భావ వాతావరణంలో అఖిలపక్ష భేటీ జరిగిందని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు.  ఇన్నాళ్లు సభ సరిగ్గా సాగనందుకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఇక మిగిలిన రోజులు ఎక్కువ సమయంపాటు సభను జరిపేందుకు అంతా అంగీకరించారని తెలిపారు.

బాల కార్మిక సవరణ బిల్లు, విజిల్ బ్లోయర్స్ పరిరక్షణ సవరణ బిల్లు, జువనైల్ జస్టిస్ బిల్లులపై రాజ్యసభలో చర్చించనున్నారు. పెరుగుతున్న ధరలు, వ్యవసాయంపై వరదలు, కరువు ప్రభావం, అసహనం, అరుణాచల్ ప్రదేశ్ పరిణామాలపై చర్చించాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించారు.
 
 పార్లమెంటు సమాచారం
► లోటు వర్షపాతం వల్లే దేశంలో వ్యవసాయ సంక్షోభం నెలకొన్నదని.. అయినా కూడా వ్యవసాయ ఉత్పత్తి రెండు శాతం పెరిగిందని వ్యవసాయశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా లోక్‌సభలో పేర్కొన్నారు.
► స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదంటూ కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ ప్రతిపాదించిన ప్రయివేటు సభ్యుడి బిల్లును ప్రవేశపెట్టకముందే లోక్‌సభ 71 - 24 ఓట్ల తేడాతో ఓడించింది.
► రక్షణ రంగంలో ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి రిజర్వు చేసిన పోస్టుల్లో 6,600 కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
► కశ్మీర్ మ్యాప్‌ను తప్పుగా ప్రచిరించారన్న ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ తదితర అమెరికా సంస్థలపై చర్యలు చేపట్టాలని బీజేపీ సభ్యుడు తరుణ్‌విజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
► ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో టీబీ రోగులున్న దేశంగా భారత్‌ను డబ్లూహెచ్‌వో తాజా నివేదిక పేర్కొంది. 2014లో 22 లక్షల టీబీ కేసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లోక్‌సభకు తెలిపారు. అయితే గత 15 ఏళ్లుగా టీబీ కేసుల సంఖ్య, ఆ వ్యాధి కారణంగా చోటుచేసుకుంటున్న మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయని వివరించారు.

Election 2024

మరిన్ని వార్తలు
Greenmark Developers