ఈసారి పాలకపక్షం మారదా?

3 Apr, 2016 02:08 IST|Sakshi
ఈసారి పాలకపక్షం మారదా?

రెండు ప్రాంతీయపార్టీలు-డీఎంకే, ఆలిండియా అన్నా డీఎంకే- ఆధిపత్యం చలాయిస్తున్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రం 15 అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఇంతకు ముందులా తీవ్ర ఉత్కంఠ జనంలో కనిపించడం లేదు. గత 35 ఏళ్లలో(1989 నుంచి) జరిగిన ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చాయి. 234 సీట్లున్న తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 1989 నుంచీ వరుసగా రెండుసార్లు ఏ ఒక్క పార్టీని గెలిపించలేదు. అయితే ఈ ఎన్నికల్లో అలాంటి రాజకీయ వాతావరణం పైకి కనిపించడం లేదు.  డీఎంకే తొలి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై, ఏఐఏడీఎంకే స్థాపకుడు, మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ మార్గంలో జయలలిత అన్నా కేంటీన్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో జనాదరణ పొందుతున్నారు. ఎన్నో ‘ఉచిత’ పథకాలతో జనరంజకంగా పాలిస్తున్నా ఐదేళ్ల ఏఐఏడీఎంకే సర్కారుపై అసంతృప్తి జనంలో లేకపోలేదు.

 అన్నాడీఎంకే ఫ్రంట్‌కే విజయమంటున్న రెండు సర్వేలు
 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే, రెండు కమ్యూనిస్ట్‌పార్టీలు, ఎంఎంకే, పుదియతమిళగం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలసిపోటీచేసిన ఏఐఏడీఎంకే ఈసారి రెండు మూడు చిన్న పార్టీలతో కలసి పోటీచేసే అవకాశాలున్నాయి. ఏఐఎస్‌ఎంకే నేత, సినీనటుడు ఆర్.శరత్‌కుమార్ ఎన్డీఏను వదిలి కిందటి నెలలో ఏఐడీఎంకే కూటమిలో చేరారు. అన్నాడీఎంకే కూడా ఇంకా చిన్నాచితకా పార్టీలతో ఎన్నికల పొత్తులు ఖరారు చేసుకోలేదు. ఏప్రిల్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు కూటముల పొత్తులు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. శుక్రవారం విడుదలైన రెండు ఎన్నికల సర్వేల ఫలితాలు- అన్నాడీఎంకే తమిళనాడు ఇటీవలి రాజకీయ ఆనవాయితీలకు భిన్నంగా వరుసగా రెండోసారి విజయం సాధిస్తుందని వెల్లడించాయి. ఇండియా టీవీ- సీఓటర్ సర్వే ప్రకారం పాలకపక్షానికి(ఏఐఏడీఎంకే కూటమి)కి 130 సీట్లు రావచ్చని అంచనా. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీకి కనీసం 118 సీట్లు అవసరం.
 
 అవినీతే ప్రచారాస్త్రం...
 ఈసారి తమిళనాట ఎన్నికల్లో అవినీతే ప్రధానాస్త్రం కానుంది. అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకెళ్లటం, టూజీ స్పెక్ట్రమ్, ఈడీ కేసుల్లో కరుణానిధి కుటుంబ సభ్యులు, మాజీ హోం మంత్రి చిదంబరం కుటుంబ సభ్యులపైనా ఈడీ కేసులు నమోదవటం ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా మారనుంది. అటు జయలలిత కూడా.. తమిళనాడులో రాజకీయమంటే అమ్మే అనేంతగా పరిస్థితులను మార్చేశారు. అయితే దీనిపై పార్టీలోనూ కాస్త అసంతృప్తి ఉంది. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఉప్పు ఇలా ప్రతిదానికీ అమ్మ బ్రాండింగ్ వేసుకుంటున్నా.. సంక్షేమపథకాలు ప్రజాక్షేత్రం వరకు చేరటం లేదనే విమర్శకూడా ఉంది. కాగా, ద్రవిడియన్ పార్టీల ప్రభావం పుష్కలంగా ఉన్న తమిళనాడులో ఓటర్లు బీజేపీని గుర్తించాలంటే చాలా కష్టమే. ఈ దిశగా కేంద్రం కొత్త పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా.. పెద్దగా ప్రభావం కనిపించటం లేదు. కన్యాకుమారి ఎంపీ సీటును గెలుచుకున్నా మిగిలిన ప్రాంతాల్లో బీజేపీకి పునాది లేదు. అయితే రజనీకాంత్ బీజేపీ తరపున ప్రచారం చేస్తారనే వార్తల నేపథ్యంలో పరిస్థితి కాస్త మారొచ్చనుకుంటున్నా.. మొదటి విడత సర్వే ప్రకారం బీజేపీ ఒక్కసీటు కూడా గెలవదని తెలుస్తోంది.
 
 2011 ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుచుకున్న సీట్లు
 ఏఐఏడీఎంకే 150, డీఎండీకే(విజయ్‌కాంత్) 29, సీపీఎం 10, సీపీఐ 9, డీఎంకే 23, కాంగ్రెస్ 5, ఇతరులు 8, బీజేపీ ఖాతాతెరవలేదు
 
 కుటుంబ కలహాలతో కోలుకోని డీఎంకే
 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన డీఎంకే 2014 లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతింది. అంతకు ముందు గెలిచిన 18 సీట్లలో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయింది. పాలకపక్షమైన ఏఐఏడీఎంకే 44.3 శాతం ఓట్లతో 37 శాతం ఓట్లు గెల్చుకోగా, డీఎంకే కేవలం 26 శాతం ఓట్లతో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. పెద్ద కొడుకు ఎంకే అళగిరి మళ్లీ పార్టీలో చేరినా డీఎంకే విజయావకాశాలు  కనిపించడం లేదు. మే 16న పోలింగ్ జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు కేవలం 30 సీట్లు మాత్రమే ఇవ్వడానికి డీఎంకే ప్రతిపాదించడంతో ఇంకా పొత్తు ఖరారు కాలేదు.
 
 విజయకాంత్ నేతృత్వంలో కొత్త ఫ్రంట్
 రెండు వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకేతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్)తో మార్చి 23న సినీనటుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయకాంత్ నాయత్వంలోని దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) పొత్తుకుదుర్చుకుంది. విజయ్‌కాంత్‌ను కొత్త ఫ్రంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు. మొత్తం 234 సీట్లలో డీఎండీకే 124  సీట్లకు పోటీచేస్తుంది. మిగిలిన సీట్లకు ఇతర భాగస్వామ్య పార్టీలు పోటీచేస్తాయి.
 
 అందరూ తెలుగు నాయుళ్లే

 ఎన్నో తరాలుగా తమిళనాట నివసిస్తున్న తెలుగావారిని అక్కడ నాయుళ్లనే పిలుస్తారు. కులాలను బట్టి కమ్మ నాయుడు, బలిజ నాయుడు, రెడ్డి నాయుడు, గవర నాయుడు అంటారు. కమ్మ, రెడ్డి కులాలకు చెందిన రాజకీయ నాయకులు అన్ని ప్రధాన పార్టీల్లో ఉన్నారు. కమ్మ నేతలు కోయంబత్తూరు ప్రాంతంలో అంటే కొంగునాడులోని సీట్ల నుంచి చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. డీఎంకే తరఫున గతంలో లోక్‌సభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేసిన సినీనటుడు నెపోలియన్(అసలు పేరు కుమరేశన్ దురైస్వామి), ఆయన సమీప బంధువు, రాష్ట్ర మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ, మరో మాజీ మంత్రి కేకేఎస్సెస్సార్ రామచంద్రన్‌లు  రెడ్డి కుటుంబాల్లో పుట్టినవారే. 1947-49 మధ్య మద్రాసు సీఎంగా ఉన్న ఓమండూరి రామసామి రెడ్డియార్ కూడా ఈ వర్గానికి చెందిన పెద్ద నేత. ఇక కమ్మ నాయుడు నేతల్లో ప్రముఖులు ఎండీఎంకే నేత వైకో(అసలు పేరు వి.గోపాలసామి), డీఎండీకే నేత, సినీనటుడు ‘కెప్టెన్’ విజయకాంత్, ప్రస్తుత చెన్నై నార్త్ అన్నాడీఎంకే ఎంపీ తుమ్మల గంగాధర వెంకటేష్‌బాబు ఉన్నారు.
 
 తమిళనాడు వృద్ధ నేతల్లో పెద్దవాడు డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి. ఆయన ప్రభుత్వా న్ని 1976 జనవరిలో(ఎమర్జెన్సీ కాలం) అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేశాక మళ్లీ 13 ఏళ్లకు 1989 జనవరిలో తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1977 జూన్‌లో అన్నాడీఎంకే నేత ఎంజీఆర్ సీఎం పదవి చే పట్టి 1987లో మరణించాక అసెంబ్లీ రద్దయ్యాక జరి గిన ఎన్నికల్లో గెలిచాకే కరుణానిధి 1989లో సీఎం ప దవి చేపట్టగలిగారు. ప్రస్తుతం 93 ఏళ్లు దాటిన ఈ సీనియర్ నేత రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు.
 
 మిత్రపక్షాలు లేని బీజేపీ
  కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఒక లోక్‌సభ సీటు గెల్చుకున్న బీజేపీకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు దొరకడం లేదు. డీఎండీకే, ఎండీఎంకే చేతులు కలిపి కొత్త ఫ్రంట్ ఏర్పాటుచేయడంతో బీజేపీకి బలమైన మిత్రుల కొరత ఏర్పడింది. మొత్తం 234 సీట్లకు మే 16న పోలింగ్ జరుగుతుంది. ఇంకా సమయం ఉన్న కారణంగా ప్రధాన జాతీయ పార్టీలు, రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఇంకా ఎన్నికల పొత్తులను ఖరారు చేసుకోలేదు.

మరిన్ని వార్తలు