ఇది మూసిన తలుపులకు తాళం వేయడమే!

29 May, 2018 14:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ కాపర్‌ కంపెనీ (వేదాంత గ్రూప్‌)ని శాశ్వతంగా మూసివేస్తు తమిళనాడు ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే. నీరు, గాలిని కలుషితం చేస్తున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ మే 22వ తేదీన తూత్తుకుడి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, తమిళనాడు పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడం, 13 మంది అమాయకులు మరణించడం తదితర పరిణాలు తెల్సినవే. ఈ సందర్భంగా పెల్లుబికిన ప్రజల ఆగ్రహంపై చన్నీళ్లు చల్లేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్, కొడైకెనాల్‌లో యూని లివర్‌ కంపెనీలను మూసివేసినంత సులభంగా తూత్తుకుడి స్టెరిలైట్‌ కాపర్‌ కంపెనీకి తమిళనాడు ప్రభుత్వం తాళం వేసింది. రేపు ఇంతే సులభంగా కాపర్‌ కంపెనీ కోర్టు తలుపులు తట్టవచ్చు. స్టే ఉత్తర్వులను తెచ్చుకోనూ వచ్చు. ఆ ఉత్తర్వులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఏదేమైనా కంపెనీ తలుపులు మళ్లీ తెరచుకోకుండా అడ్డుకోగలదా? అందుకు అవసరమైన సమస్త సమాచారాన్ని సేకరించిందా? ఇప్పుడు సిద్ధంగా లేకపోయినా అప్పీళ్ల క్రమంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరచి పటిష్ట వాదనతో కేసు గెలవచ్చు.

భయంకరంగా కలుషితమైన కంపెనీ ఆవరణ, పరిసరాలను ఎవరు శుద్ధి చేస్తారు ? కంపెనీ కాలుష్యం కారణంగా తరతరాలు జబ్బు పడిన ప్రజలకు నష్ట పరిహారం ఎవరు చెల్లిస్తారు ? తమ పాపం ఏమీ లేకున్నా ఉన్నఫలంగా ఉద్యోగం ఊడిపోయిన దాదాపు 32 వేల మంది కార్మికులకు జీవనోపాధి ఎవరు కల్పిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానం ప్రభుత్వం చూపినప్పుడే కంపెనీని శాశ్వతంగా మూసివేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారు. అందుకు సార్థకత ఉంటుంది. కాపర్‌ కంపెనీ కోర్టుకెళితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాలుష్య నియంత్రణా బోర్డు సలహాలను, సూచనలను మాత్రం తీసుకోవద్దు సుమా! ఇటు రాష్ట్ర కాలుష్య నియంత్రణా బోర్డు, అటు కేంద్ర పర్యావరణ శాఖలు స్టెరిలైట్‌ కాపర్‌ కంపెనీకి ఇంతకాలం ఊడిగం చేశాయి.

ప్రభుత్వ పారిశ్రామిక నిబంధనల ప్రకారం స్టెరిలైట్‌ కంపెనీలను ‘రెడ్‌ క్యాటగిరీ’ జోన్‌లో మాత్రమే ఏర్పాటు చేయాలి. ‘స్పెషల్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ హజార్డస్‌ యూజ్‌ జోన్‌’ను రెడ్‌ క్యాటగిరీ జోన్‌గా వ్యవహరిస్తారు. అయితే తమిళనాడులోని తూత్తుకుడిలో మాత్రం ‘జనరల్‌ ఆర్‌ లైట్‌ ఇండస్ట్రీస్‌’ జోన్‌లో పాక్షికంగా ‘అగ్రికల్చర్‌ జోన్‌’లో పాక్షికంగా స్టెరిలైట్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. పైగా అవసరమైన గ్రీన్‌కారిడర్‌ను కంపెనీ మెయింటెన్‌ చేయలేదు. 2007లో కంపెనీ తన స్మెల్టర్‌ (ముడిసరకును మండించి ద్రావకంగా మార్చేది)ను విస్తరించింది.

తమ కంపెనీకి 172 హెక్టార్ల భూమి ఉందని, స్మెల్టర్‌ విస్తరణ వల్ల వచ్చే అధిక కాలుష్యాన్ని నివారించే చర్యలకు ఈ భూమి సరిపోతుందన్న వాదనతో స్మెల్టర్‌ను విస్తరించింది. స్మెల్టర్‌ విస్తరణలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను కంపెనీ పాటించలేదు. 172 హెక్టార్ల భూమి ఉన్నట్లు 2007లో కంపెనీ ప్రకటించినప్పటికీ నేటికి కూడా 102.5 హెక్టార్లకు మించి భూమి లేదు. నిబంధనల ప్రకారం 123 మీటర్ల చిమ్నీని ఏర్పాటు చేయాలి. కంపెనీలో 60 మీటర్ల చిమ్నీ మాత్రమే ఉంది. అంటే స్థాపించిన దగ్గరి నుంచి విస్తరణ వరకు కంపెనీలో అన్నీ ఉల్లంఘనలే.

కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీ అందుకు నష్టపరిహార చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాలని 2013లో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వంద కోట్లను ప్రభుత్వం వసూలు చేసిందా? చేస్తే వాటిని ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టింది? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి నేటికి సమాధానం లేదు. కంపెనీకి వ్యతిరేకంగా ప్రజల ఆందోళన తీవ్రమైన నేపథ్యంలో తనను తాను కాపాడు కోవడంలో భాగంగా తమిళనాడు కాలుష్య నిరోధక బోర్డు ఇటీవల కంపెనీకి విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేసింది. దీంతో కంపెనీ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌ నిర్ణయమంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే మూతపడిన తలుపులకు తాళం వేసింది.

మరిన్ని వార్తలు