వాళ్లను చంపేయాలి... మాజీ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

26 Feb, 2016 17:37 IST|Sakshi
వాళ్లను చంపేయాలి... మాజీ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ:   ఒకవైపు  జేఎన్యూ వివాదం రగులుతూ ఉండగానే ఈ కేసును విచారించిన జడ్జి  చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌ఎస్‌ దింగ్రా... అఫ్జల్‌ గురును వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను చంపేయాలంటూ వివాదానికి తెర లేపారు.  ఈ వివాదం నేపథ్యంలో ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్య్వూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

పార్లమెంటుపై దాడికి పాల్పడిన కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష  విధించడాన్ని ఖండిస్తున్న   జేఎన్‌యూ  విద్యార్థులను ఆయన తప్పు బట్టారు. ‘జ్యుడిషియల్‌ కిల్లింగ్‌’ అంటూ ఆరోపించడంపై ఎస్‌ఎస్‌ దింగ్రా మండిపడ్డారు.  పార్లమెంటుపై దాడి సందర్భంగా 40,50 మంది ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటని  వారిని వెనకేసుకొస్తున్న పార్లమెంటు సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు. అపుడు పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు.

సమాజానికి ప్రమాదంగా పరిణమించిన  వ్యక్తులను  శిక్షించే అధికారం  మన న్యాయ వ్యవస్థకు ఉంటుందని ఎస్‌ఎస్‌ దింగ్రా స్పష్టం చేశారు.  భారతీయ శిక్షా స్మృతిలో అలాంటి నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.  ఇలాంటి శిక్షలు హత్యలు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. 2002లో పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా 15 మంది మృతికి కారణమైన వ్యక్తి బలిదానం చేశాడంటూ సంతాపం వ్యక్తం చేయడం సరైంది కాదని దింగ్రా  మండిపడ్డారు.  

అఫ్జల్‌గురుని ఉరితీసిన రోజును సంతాప దినంగా వ్యవహరిస్తూ జేఎన్‌యూలో విద్యార్థులు ర్యాలీ  వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కూడా దీనిపై దుమారం చెలరేగుతోంది.

మరిన్ని వార్తలు