వారి ఆదాయ మార్గాలు చెప్పాలి

17 Feb, 2018 02:48 IST|Sakshi
సుప్రీంకోర్టు

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కుటుంబీకుల ఆదాయంపై సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: ఎన్నికల విధానంలో సంస్కరణలకు బాటలు పరిచే కీలక ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతోపాటు వారి జీవిత భాగస్వాముల ఆస్తులతోపాటు ఆదాయ మార్గాలనూ వెల్లడించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వారి జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన ఇతరుల ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించటంతోపాటు ఆస్తులు అకస్మాత్తుగా పెరిగిందీ లేనిదీ పరిశీలించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది.

ఈ వ్యవస్థ అందజేసిన వివరాలపై ‘సంబంధిత శాసన వ్యవస్థలు’ పరిశీలించి సదరు పార్లమెంటు లేదా శాసనసభల సభ్యులు అర్హులో కాదో నిర్ణయిస్తాయని చెప్పింది. అభ్యర్ధుల ఆస్తుల వివరాలను తెలుసుకోవటం పౌరుల ప్రాథమిక హక్కని తెలిపింది. ఇందుకోసం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. దురదృష్టవశాత్తూ ఇటువంటి వాటిపై పార్లమెంట్‌ కానీ, ఎన్నికల సంఘం కానీ శ్రద్ధ పెట్టటం లేదని పేర్కొంది.

పదవీ కాలంలో భారీగా ఆస్తులు పెంచుకునే ఎమ్మెల్యేలు, ఎంపీలపై నిఘా ఉంచే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ ‘లోక్‌ ప్రహరి’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ జె.చలమేశ్వర్, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన బెంచ్‌ విచారణ చేపట్టింది.

ఆస్తులను అకస్మాత్తుగా పెంచుకున్న ఒక ప్రజాప్రతినిధిపై విచారణ చేపట్టే వీలుండాలన్న పిటిషనర్‌ వాదనను ఈ సందర్భంగా న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తులపై చేపట్టే ఇలాంటి దర్యాప్తు రాజకీయ కక్ష సాధింపుగా మారుతుందని వ్యాఖ్యానించింది. ఆస్తులు కూడబెట్టుకునేందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావాలనుకునే వారి కారణంగా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి వాటిని అడ్డుకోకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందనీ, మాఫియా పాలనకు ఊతమిచ్చినట్లవుతుందని తెలిపింది.

మరిన్ని వార్తలు