హింసను సహించేది లేదు

28 Aug, 2017 01:11 IST|Sakshi
హింసను సహించేది లేదు

► డేరా విధ్వంసంపై ‘మన్‌ కీ బాత్‌’లో మోదీ పరోక్ష ప్రస్తావన
► సెప్టెంబర్‌ 15 నుంచి ‘స్వచ్ఛత సేవ’ ప్రచారంలో పాల్గొనండి
► జన్‌ధన్‌లో 30 కోట్ల మందికి భరోసా: మోదీ


న్యూఢిల్లీ: విశ్వాసం పేరిట హింసను సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని, అందరూ చట్టం ముందు తలొగ్గాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ నెలవారీ రేడియో ప్రసంగంలో... హరియాణా, పంజాబ్‌ల్లో గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ అనుచరులు సృష్టించిన విధ్వంసాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. సెప్టెంబర్‌ 15 నుంచి ‘స్వచ్ఛత సేవ’ ప్రచారంలో  భాగస్వాములుగా కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే
ఒకవైపు దేశం పండుగల సంబరాల్లో ఉండగా.. మరోవైపు హింసాత్మక సంఘటనల వార్తలు వినిపిస్తే తప్పనిసరిగా ఆందోళన చెందాల్సి వస్తోంది. బుద్ధుడు, గాంధీలు పుట్టిన దేశం మనది. శతాబ్దాలుగా మన పూర్వీకులు ఆకలింపు చేసుకున్న సోదర భావం, అహింస, పరస్పర గౌరవం మనకు వారసత్వంగా అలవడ్డాయి. '

ఎర్రకోట నుంచి.. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక విషయం స్పష్టం చేశాను. విశ్వాసం పేరిట హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెప్పాను. అది మత నమ్మకాలకు సంబంధించినదైనా, రాజకీయ సిద్ధాంతాలు లేక వ్యక్తి విధేయత, ఆచార, సంప్రదాయాల విషయంలోనైనా హింసను సహించేది లేదు. ఒకరి విశ్వాసాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఏ ఒక్కరికి లేదు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారు, హింసాత్మక ప్రవృత్తిని అనుసరించేవారి విషయంలో ఈ దేశం, ఏ ప్రభుత్వమైనా చూస్తూ ఊరుకోదని హామీనిస్తున్నా.

పండుగలు నమ్మకానికి ప్రతీకలు
దేశంలో భిన్నత్వమనేది వంటకాలు, జీవన విధానం, వస్త్రధారణకే పరిమితం కాలేదు. ప్రతీ విషయంలో అది కనిపిస్తుంది. ఇటీవల గుజరాత్‌ వరదల్లో దెబ్బతిన్న 22 ఆలయాల్ని, రెండు మసీదుల్ని జమియత్‌–ఉలేమా–ఈ–హింద్‌ వాలంటీర్లు శుభ్రం చేశారు. ఐకమత్యానికి అది మంచి ఉదాహరణ. ఆధునిక భారతంలో పండుగలు విశ్వాసం, నమ్మకానికి ప్రతీకలు. జైనులు జరుపుకునే సంవత్సరి పండుగ క్షమాగుణం, అహింస, సోదరభావానికి ప్రతీక.  గణేశ్‌ చతుర్థి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఈ పండుగ.. ఐక్యత, సమానత్వం, నిజాయితీకి అద్దం పడుతుంది. కొద్ది రోజుల్లో ఈద్‌–ఉల్‌–జువా జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

స్వచ్ఛత కోసం మరో ముందడుగు
దేశంలో 67 శాతం ప్రజలకు ప్రస్తుతం మరుగుదొడ్ల సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మూడేళ్ల క్రితం అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించాం. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు చూశాం. ఈ సారి గాంధీ జయంతిని ‘క్లీన్‌ సెకండ్‌ అక్టోబర్‌’గా జరుపుకోవాలి. సెప్టెంబర్‌ 15 నుంచి ‘స్వచ్ఛత సేవ’ ప్రచారంలో అందరూ పాలుపంచుకోవాలి. జన్‌ధన్‌ యోజన ప్రారంభించి ఆదివారంతో మూడేళ్లు పూర్తవుతుంది. దాదాపు 30 కోట్ల మందికి జన్‌ధన్‌ ఖాతాలు ఇచ్చాం. రూ. 65 వేల కోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి.

‘నవ భారత్‌’ దిశగా..
2022 నాటికి ‘నవ భారత్‌’ కల సాకారం చేసేందుకు స్పష్టమైన లక్ష్యాలతో ముందు కు సాగాలని ప్రధాని మోదీ కేంద్ర ప్రభు త్వ ఉన్నతాధికారులకు సూచించారు. ఆయన ఆదివారం 80 మంది కేంద్ర ప్రభు త్వ అదనపు కార్యదర్శులు, ఉమ్మడి కార్యదర్శులతో సమావేశమయ్యారు.  తయారీ రంగం వైద్య పరికరాల తయారీపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సానుకూల పని వాతావరణాన్ని  కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కొత్త చట్టాలు రూపొందించిన తరువాత పాతవి సమీక్షించి, అనసరమని భావిస్తే రద్దు చేయాలని అన్నారు. 

మరిన్ని వార్తలు