విప్రోపై బయోదాడి చేస్తానంటూ మెయిల్‌

6 May, 2017 17:30 IST|Sakshi
విప్రోపై బయోదాడి చేస్తానంటూ మెయిల్‌

బెంగుళూరు: కంపెనీ కార్యాలయాలపై బయోదాడి చేస్తానని దేశవాళీ ఐటీ దిగ్గజం విప్రోకు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. ఈ మేరకు కంపెనీ సైబర్‌ సెక్యూరిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ-మెయిల్‌కు అటాచ్‌ చేసిన ఓ లింక్‌కు రూ.500 కోట్లను బిట్‌కాయిన్ల(డిజిటల్‌ మనీ) రూపంలో చెల్లించాలని లేకపోతే కంపెనీ కార్యాలయాలపై బయోదాడి తప్పదని మెయిల్‌లో ఉంది.

ఫిర్యాదును తీసుకున్న పోలీసులు సైబర్‌ టెర్రరిజం కింద కేసును నమోదు చేశారు. 20 రోజుల్లోగా రూ.500 కోట్లు చెల్లించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సివుంటుందని బెదరింపు మెయిల్‌లో ఉంది. బయోదాడిలో భాగంగా ప్రాణాంతకమైన రిజిన్‌(క్యాస్టర్‌ ఆయిల్‌ ప్లాంట్‌లలో దొరుకుతుంది)ను వినియోగిస్తానని మెయిల్‌లో అగంతకుడు పేర్కొన్నాడు.

విప్రోలోని పలువురు సీనియర్‌ అధికారులందరికీ బెదిరింపు మెయిల్‌ వెళ్లింది. రిజిన్‌ను కంపెనీలో ఉండే కేఫ్‌లో వినియోగిస్తామని లేకపోతే డ్రోన్‌ ద్వారా కంపెనీ ఆవరణలో వెదజల్లుతామని లేదా టాయిలట్‌ పేపర్‌ ద్వారా ఇలా ఏ రూపంలోనైనా దాడి జరగొచ్చని మెయిల్‌లో వివరించాడు అగంతకుడు.

కేవలం బెదిరింపుతో ఇది ఆగిపోదని శాంపిల్‌గా రెండు గ్రాముల రెజిన్‌ను బెంగుళూరులోని విప్రో బ్రాంచ్‌లకు కొద్ది రోజుల్లో పంపుతానని.. ఆగంతకుడు హెచ్చరించాడు. తన వద్ద మొత్తం ఒక కిలో రెజిన్‌ ఉన్నట్లు చెప్పాడు. ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో 22 వీధి కుక్కలు మరణించడానికి తానే కారణమని రెజిన్‌ను వాటిపై ప్రయోగించడం వల్లే అవి మరణించాయని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన న్యూస్‌ పేపర్‌ క్లిప్పింగ్‌ను కూడా ఈ-మెయిల్‌కు జత చేశాడు.

బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన విప్రో.. దేశంలోని అన్ని బ్రాంచ్‌లలో భద్రతను కట్టుదిట్టం చేసింది. రాబోవు రోజుల్లో కంపెనీ ఆపరేషన్లు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు