చర్చిపై బాంబు దాడి : ముగ్గురి అరెస్ట్‌

30 Dec, 2019 15:42 IST|Sakshi

కోల్‌కతా : తూర్పు మిడ్నపూర్‌ జిల్లాలోని భగవాన్‌పూర్‌లోని చర్చిపై ఆరెస్సెస్‌, బీజేపీకి చెందినవారుగా భావిస్తున్న కొందరు బాంబులతో దాడి చేసి అక్కడున్న కారును ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. చర్చి ఫాస్టర్‌ ఫిర్యాదుపై ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్ధానిక బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తలు ఎనిమిది మంది ఈ దాడిలో పాల్గొన్నారని పాస్టర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా ఒడిషా, మధ్యప్రదేశ్‌, ఢిల్లీల్లో గతంలో చర్చిలపై దాడులు జరిగినా బెంగాల్‌లో ఈ తరహా దాడి ఇదే తొలిసారి కావడం గమనార్హం. తొలుత చర్చి ప్రాంగణంలో రెండు బాంబులు విసిరిన దుండగులు ప్రార్ధనలు చేస్తున్నవారు భయంతో పరుగులు తీయగానే లోపలికి చొచ్చుకువచ్చి అక్కడున్న చైర్లు, టేబుళ్లు, కిటికీ అద్దాలు, మైక్రోఫోన్లను ధ్వంసం చేశారు. పదిహేను నిమిషాల పాటు విధ్వంసానికి పాల్పడిన అనంతరం వారు అక్కడి నుంచి వెనుదిరిగారని పాస్టర్‌ తెలిపారు. కాగా చర్చిపై దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు