భారీ వర్షాలకు వణికిన ముంబై

26 Jun, 2018 02:24 IST|Sakshi
ముంబైలో వర్షం ధాటికి ఓ భవంతి గోడ, పార్కింగ్‌ స్థలం కుంగడంతో పక్కనున్న ఖాళీస్థలంలో పడిపోయిన కార్లు

ముంబై, థానేల్లో నలుగురు మృతి

రాబోయే రెండ్రోజుల్లో భారీ వర్షాలు!

సాక్షి, ముంబై / న్యూఢిల్లీ / కోల్‌కతా: నైరుతీ రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేవలం ఒక్కరోజులో 231.4 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం ప్రభావంతో ముంబై, థానేలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పరేల్, దాదర్, హిందుమాత, భైకళ, కింగ్‌ సర్కిల్‌ తదితర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది.

థానేలోనూ 229.8 మీల్లిమీటర్ల భారీ వర్షం కురవడంతో పలుచోట్ల ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పశ్చిమ, సెంట్రల్, హార్బర్‌ 3 మార్గాల్లో లోకల్‌ రైళ్లన్నీ  ఆలస్యంగా నడిచాయి. దక్షిణ ముంబైలోని మెట్రో థియేటర్‌ వద్ద చెట్టు కూలడంతో ఆదివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో థానేలోని వాడోల్‌లో ఇంటి పక్కనున్న గోడ కూలిపోవడంతో కిరణ్‌ గైక్వాడ్‌(13) అనే బాలుడు చనిపోయాడు. నవీముంబైలోని మలాద్‌లోని మురికికాలువలో పడిపోవడంతో నాగేందర్‌ అనే యువకుడు మృతి చెందాడు.

ముంబైలోని వడాలా ప్రాంతంలో ఓ పెద్ద ప్రహరి గోడ కూలిపోవడంతో 15 కార్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ కార్లలో ప్రజలెవరైనా చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రవాహంతో ఇక్కడి రోడ్డు సైతం కుంగిపోయింది. కాగా, రాబోయే 24 నుంచి 48 గంటల్లో ముంబైలో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు
పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటుకు పురూలియాలో ఓ బాలుడు, 24 ఉత్తర పరగణాల జిల్లాలో ఇద్దరు, 24 దక్షిణ పరగణాల జిల్లాలో మరొకరు చనిపోయారు. కూచ్‌బెహార్‌ జిల్లాలో వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న సుతుంగా నదిలో మునిగిపోయి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్‌సారి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. అస్సాంలోని చఛర్‌ జిల్లాలో ఇద్దరు వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వరద తాకిడికి చనిపోయిన ప్రజల సంఖ్య 26కు చేరుకుంది.

ఓవైపు ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తుండగా.. మరోవైపు వేడి కూడా రికార్డు స్థాయిలో నమోదయింది. ఆదివారం ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత 42.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రంకల్లా ఆకాశం మేఘావృత్తం కావడంతో పాటు గాలిదుమారం వచ్చే అవకాశముందని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని బందా నగరంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. రాబోయే 2–3 రోజుల్లో తూర్పు యూపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందన్నారు. చండీగఢ్‌లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

మరిన్ని వార్తలు