రత్నగిరి డ్యామ్‌కు గండి, ఆరుగురు మృతి

3 Jul, 2019 09:16 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆర్థిక రాజధాని ముంబయిని కుండపోత వర్షాలు వీడటం లేదు. గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంత అయ్యారు. మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా రత్నగిరిలోని తివారీ డ్యామ్‌కు గండిపడింది. దీంతో సమీపంలోని ఏడు గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ఆరుగురు మృతి చెందగా, 23మంది గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకూ రెండు మృతదేహాలను వెలికి తీశారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
కాగా థానేలో ఓ హోటల్‌లో వరద నీరు చేరటంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. వరద నీరు ఒక్కసారిగా కిచెన్‌లోకి రావడంతో... ఫ్రిజ్‌నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్రిజ్‌ స్విచ్‌ ఆపేందుకు విద్యుత్‌ వైరును పట్టుకోవడంతో వీరేంద్ర దాస్‌ బనియా (27), రాజన్‌ దాస్‌ (19) మృతి చెందినట్లు థానే రూరల్‌ పోలీస్‌ అధికారి యువరాజ్‌ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. 


భారీ వర్షాలకు ముంబైలో ప్రజా రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాతావరణం సహకరించని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో 203 పూర్తిగా రద్దవ్వగా, మరో 55 దారి మళ్లాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రేపటి (గురువారం) వరకు విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే మూసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వే జోన్‌లకు సంబంధించిన అనేక దూరప్రాంతపు రైళ్లను కూడా రద్దు చేశారు.

మరిన్ని వార్తలు