మూడు దశాబ్దాల భోఫోర్స్‌

18 Oct, 2017 20:26 IST|Sakshi

న్యూఢిల్లీ : భోఫోర్స్‌.. మూడు దశాబ్దాలు గడుస్తున్నా.. ఈ పదం మాత్రం రాజీవ్‌గాంధీని, కాంగ్రెస్‌ను విడచి పెట్టడం లేదు. తాజాగా భోఫోర్స్‌ కుంభకోణంపై విచారణను అప్పటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం అణిచివేసిందనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. భోఫోర్స్‌ కుంభకోణంపై ప్రయివేట్‌ డిటెక్టివ్‌ హైఖేల్‌ హెర్ష్‌మన్‌ పేర్కొన్న వాస్తవాలు-పరిస్థితులను పరిశీలిస్తామని బుధవారం సీబీఐ ప్రకటించింది. అమెరికాలోని ఫైర్‌ఫాక్స్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ అధ్యక్షుడైన మైఖెల్‌ హెర్ష్‌మన్‌ తాజాగా ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌ గాంధీకి స్విస్‌ బ్యాంక్‌ ఖాతా గురించి పేర్కొన్నారు. అంతేకాక గత వారం జరిగిన ప్రయివేట్‌ డిటెక్టివ్‌ల సమావేశంలోనూ భోఫోర్స్‌ స్కామ్‌లో నల్లధనం స్విస్‌ ఖాతాలకు ఎలా చేరిందో ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో మరోసారి భోఫోర్స్‌ స్కామ్‌పై సీబీఐ పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది.

30 ఏళ్ల భోఫోర్స్‌

  • 1986 మార్చి 24 : భారత ప్రభుత్వం 410 యూనిట్ల 155 ఎంఎం హవిట్జర్‌ గన్స్‌ కొనుగోలుకు స్వీడన్‌కు చెందిన ఏబీ భోఫోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
  • ఈ ఒప్పందం విలువ రూ.1,437.72 కోట్లు.
  • 1987 ఏప్రిల్‌ 16 : భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి భోఫోర్స్‌ సంస్థ ఈ ఒప్పందం చేసుకున్నట్లు తొలిసారి స్వీడిన్‌ రేడియో ప్రకటించింది.
  • 1987 ఏప్రిల్‌ 20 : ఈ ఒప్పందంలో ఎవరు మధ్యవర్తిగా లేరు, ఎవరికీ ముడుపులు చెల్లింపులు చేయలేదని నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ లోక్‌సభలో ప్రకటన.
  • 1987 ఆగస్టు 6 : బీ శంకరానాంద్‌ నేతృత్వంలో భోఫోర్స్‌ ముడుపులపై విచారణ జరిపేందుకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు
  • ఫిబ్రవరి 1988 : భోఫోర్స్‌ కుంభకోణంపై నిజానిజాలు తెలుసుకునేందుకు భారతీయ విచారణాధికారుల స్వీడన్‌ పర్యటన
  • 1988 జులై 18 : భోఫోర్స్‌ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ తన నివేదకను పార్లమెంట్‌కు సమర్పించింది.
  • నవంబర్‌ 1989 : సాధారణ ఎన్నికల్లో రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ పరాజయం. వీపీ సింగ్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
  • 1990 జనవరి 22 : భోఫోర్స్‌ కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. విచారణకు ప్రభుత్వం ఆదేశం
  • 1990 ఫ్రిబరి 7 : భోఫోర్స్‌ స్కామ్‌పై స్విస్‌ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అధికారిక లేఖ
  • 1992 ఫిబ్రవరి 17 : భోఫోర్స్‌ స్కామ్‌లో ఎవరెవరికి ఎంత ముడుపులు ముట్టాయో ప్రకటించిన ప్రముఖ జర్నలిస్ట్‌ అండర్సన్‌.
  • 1993 జులై 30 : భోఫోర్స్‌ కేసులో కీలక పాత్రధారి ఒట్టావియో ఖత్రోచి దేశం విడిచి వెళ్లిపోయాడు. మళ్లీ ఏనాడు దేశంలోకి అడుగు పెట్టలేదు.
  • 1997 ఫిబ్రవరి 17 : ఖత్రోచి మీద ఎన్‌బీడబ్ల్యూ రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ.
  • 1998 డిసెంబర్‌ 8 : ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లోని బ్యాంక్‌ ఖాతాలకు ముడుపుల మళ్లింపు గురించి స్విస్‌ ప్రభుత్వానికి రెండో లేఖ రాసిన భారత్‌.
  • 1999 అక్టోబర్‌ 22 : ఖత్రోచీపై ఛార్జిషీట్‌ ధాఖలు
  • 2000 : తనపై ఉన్న అరెస్ట్‌ వారెంట్‌ను కొట్టివేయాలని సుప్రీం కోర్టును కోరిన ఖత్రోచి. ముందు సీబీఐ విచారణకు హాజరు కండి. తరువాత పరిశీలిద్దం అన్న సుప్రీం కోర్టు.
  • 2000 మార్చి 18 : భోఫోర్స్‌ విచారణ కోసం తొలిసారి భారత్‌కు వచ్చిన చద్దా.
  • 2000 అక్టోబర్‌ 9 : భోఫోర్స్‌ కుంభకోణంలో హిందూజా సోదరులను చేర్చుతూ అదనపు ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ
  • 2000 డిసెంబర్‌ 20 : ఖత్రోచి మలేసియాలో అరెస్ట్‌. మలేషియన్‌ సెషన్స్‌ కోర్టులోనే విచారణ
  • 2003 జులై 21 : కత్రోచి బ్యాంక్‌ అకౌంట్లను సీజ్‌ చేయాలంటూ బ్రిటన్‌ ప్రభుత్వానికి లేఖ
  • 2004 ఫిబ్రవరి 4 : రాజీవ్‌ గాంధీ, డిఫెన్స్‌ సెక్రెటరి భట్‌నగర్‌ మృతి చెందడంతో చార్జిషీట్‌ను వారి పేర్ల తొలగింపు
  • 2005 మార్చి 31 :  హిందూజా, ఏబీ భోఫోర్స్‌ల విచారణకు క్వాష్‌ పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్ట్‌ అనుకూలంగా తీర్పు.
  • 2005 సెప్టెంబర్‌ 19 : ఢిల్లీ హైకోర్ట్‌ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన సీబీఐ. విచారణ కొనసాగించవచ్చని తేల్చి చెప్పిన సుప్రీం.
  • 2006  జనవరి 16: ఫ్రీజింగ్‌ అకౌంట్ల లావాదేవీలపై పూర్తి సమాచారాన్ని చెప్పాలని సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.
  • 2007 ఫిబ్రవరి 6 : ఖత్రోచిని అర్జెంటీనాలో అరెస్ట్‌ చేసిన పోలీసులు. భారత అభ్యర్థనను తోసిపుచ్చిన అర్జెంటీనా.
  • 2009 ఏప్రిల్‌ : ఖత్రోచిమీద రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ ఉపసంహరించుకున్న సీబీఐ
  • 2009 అక్టోబర్‌ : ఖత్రోచి మీద కేసును ఉసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరిన సీబీఐ. అదే సమయంలో లండన్‌ బ్యాంక్‌లోని ఖత్రోచి లావాదేవీలపై డాక్యుమెంట్స్‌ కోసం అగర్వాల్‌ అనేవ్యక్తి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు.
  • 2010 డిసెంబర్‌ 31 : ఖత్రోచీ, విన్‌ చద్దాలు పన్ను ఎగవేతపై ఇన్‌కంట్యాక్స్‌ ట్రిబ్యునల్‌ ఆగ్రహం. కేసు నమోదుకు ఆదేశం.
  • 2011 పిబ్రవరి 9 : భోఫోర్స్‌ స్కామ్‌పై సీబీఐ తీరును విమర్శించిన ఇన్ఫర్మేషన్‌ కమిషన్.
  • 2012 ఏప్రిల్‌ 24 : భోఫోర్స్‌ కుంభకోణంపై మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ, అమితాబ్‌ బచ్చన్‌ల పాత్ర ఉందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్వీడన్‌ ప్రభుత్వం ప్రకటన.
  • 2013 జులై 13 : భోఫోర్స్‌ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఖత్రోచి మరణం.
  • 2017 జులై 14 : సుప్రీంకోర్ట్‌ లేదా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే భోఫోర్స్‌ కేసుపై పునర్విచారణ సాధ్యమవుతుందని సీబీఐ ప్రకటన.
  • 2017 అక్టోబర్‌ 18 : ప్రైవేటు డిటెక్టివ్ మైఖేల్ హెర్షమ్ పేర్కొన్న బోఫోర్స్ కుంభకోణం గురించి వాస్తవాలను, పరిస్థితులను పరిశీలిస్తానని సిబిఐ ప్రకటన.
మరిన్ని వార్తలు