అరుణాచల్‌లో మూడు భూకంపాలు

20 Jul, 2019 06:57 IST|Sakshi

గువాహటి/ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒకే రోజు వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. శుక్రవారం కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంభవించిన ఈ భూకంపాల తీవ్రత రిక్టరు స్కేలుపై 5.6, 3.8, 4.9గా నమోదైంది. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మొదటి భూకంపం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్‌ జిల్లాలో 5.6 తీవ్రతతో మధ్యాహ్నం 2.52 గంటల సమయంలో 10 కి.మీ. లోతులో సంభవించింది.

ఈ భూకంప ధాటికి ఇటానగర్, గువాహటి, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, నాగాలాండ్‌లోని దిమాపూర్‌ల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావారణ శాస్త్ర విభాగం వెబ్‌సైట్‌ వెల్లడించింది. రెండో భూకంపం 3.8 తీవ్రతతో మధ్యాహ్నం 3.04 గంటల సమయంలో తూర్పు కామెంగ్‌లో 10 కి.మీ. లోతులో సంభవించింది. మూడో భూకంపం 4.9 తీవ్రతతో మధ్యాహ్నం 3.21 గంటల ప్రాంతంలో అరుణాచల్‌లోని కురుంగ్‌ కుమే జిల్లాలో 95 కి.మీ. లోతులో సంభవించినట్లు పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలు భూకంప పటంలో ప్రమాదకరమైన 5వ జోన్‌లోకి రావడంతో తరచూ భూకంపాల బారిన పడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు