-

ముగ్గురు రైతుల ఆత్మహత్య

14 Jun, 2017 01:32 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో దుస్థితి
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో రైతుల ఆత్మహ త్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గతవారం రోజుల్లో మరణించిన రైతుల సంఖ్య ఐదుకు చేరింది. సెహోర్‌ జిల్లా జజ్నాకు చెందిన దులిచంద్‌ కీర్‌ (55), హోషంగాబాద్‌ జిల్లా భైరోపూర్‌కు చెందిన క్రిపారం దిగోడియా (68) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.

దులిచంద్‌ కీర్‌ ఇంట్లోని విషపు గుళికలు మింగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా, తన తండ్రికి బ్యాంకుల్లో  రూ.4 లక్షలు, ఇతరుల వద్ద రూ.2 లక్షల అప్పు ఉన్నట్లు కీర్‌ సింగ్‌ కుమారుడు చెప్పాడు. మరో రైతు క్రిపారం దిగోడియా అప్పుల బాధ తాళలేక చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు.   

హార్దిక్‌ పటేల్‌ అరెస్ట్‌
రత్లాం/నీముచ్‌: రైతుల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ జిల్లాకు కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా, పటీదార్‌ ఆందోళన్‌ నాయకుడు హార్దిక్‌ పటేల్‌లు మంగళవారం విడివిడిగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 

మరణించిన రైతుల బంధువులను పరామర్శించేందుకు మంద్‌సౌర్‌కు బయల్దేరిన పటేల్‌ను నయాగావ్‌లో అరెస్టు చేశారు. సింధియాను నయాగావ్‌–జౌరా టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప కాలానికి రైతులకు రుణ మాఫీ అవసరమేనని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడంతో, అధిక దిగుబడులు వచ్చినా రైతులు రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారని మంగళవారం ఆయన ఢిల్లీలో అన్నారు.
 

మరిన్ని వార్తలు