కథువా హత్యాచారం : ముగ్గురికి జీవిత ఖైదు

10 Jun, 2019 18:05 IST|Sakshi

చండీగఢ్‌ : దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన పఠాన్‌కోట్‌ స్పెషల్ కోర్టు సోమవారం మధ్యాహ్నం వారిలో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సాంజీ రామ్‌, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్‌ ఖజూరియా, ప్రవేష్‌కుమార్‌లకు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో దోషులుగా తేలిన ముగ్గురు పోలీసు అధికారులు సురేందర్‌ వర్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ తిలక్‌ రాజ్‌, ఆనంద్‌ దత్తాలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా ఖరారు చేస్తూ ప్రత్యేక న్యాయస్ధానం తుదితీర్పు వెలువరించింది.

కాగా, జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే.  బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి.


ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్‌, అతని కొడుకు విశాల్‌, మైనర్‌ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్‌ పోలీస్ ఆఫీసర్లు దీపక్‌ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే సాంజిరామ్‌ నుంచి  నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్‌, సబ్ ఇన్సిపెక్టర్‌ ఆనంద్‌ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది.

మరిన్ని వార్తలు