బియ్యం అయిపోవ‌డంతో నాగుపామును చంపి..

20 Apr, 2020 12:02 IST|Sakshi

ఇటాన‌గ‌ర్ :  ఇంట్లో బియ్యం అయిపోవ‌డంతో అడ‌వికి వెళ్లి 12 అడుగుల పొడ‌వైన  నాగుపామును చంపి తిన్నారు ముగ్గురు  వేట‌గాళ్లు. ఈ ఘ‌ట‌న అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. నాగుపామును చంపి..త‌మ భుజాల‌పై వేసుకొని ఫోటోకి ఫోజిచ్చారు. అంతేకాకుండా మాంసాన్ని శుభ్రం చేసుకునేందుకు అరిటాకుల‌తో చ‌క్క‌గా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా బ‌య‌టికెళ్లి ప‌నులు చేసుకునే ప‌రిస్థితి లేనందు వ‌ల్ల ఇంట్లో బియ్యం అయిపోయింద‌ని తెలిపారు. కాబ‌ట్టి అడ‌విలో ఏదో ఒక‌టి దొరుకుతుంద‌ని వెతుకుతూ వ‌చ్చామ‌ని..ఈ క్ర‌మంలో త‌మ‌కు నాగుపాము క‌నిపించ‌డంతో దాన్ని చంపి తిన్నామ‌ని వీడియోలో పేర్కొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం..వీరిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. నాగుపామును సంహ‌రించ‌డ‌మే కాకుండా, దాన్ని చంపి తిన్నందుకు న‌మోదైన కేసులో వీరికి బెయిల్ కూడా మంజూరు అవ్వ‌దు. అంత‌రించిపోతున్న పాము జాతుల‌కు అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ నిల‌యం. ఇటీవ‌లే ఆకుప‌చ్చ రంగులో ఉన్న ఓ అరుదైన పామును శాస్ర్త‌వేత్త‌లు గుర్తించారు. దీనికి స‌ల‌జ‌ర్స్ పిట్ వైప‌ర్ అని పేరు పెట్టారు. హ్యారీపోట‌ర్ సినిమాలోని స‌ల‌జ‌ర్ క్యారెక్ట‌ర్‌ను పోలి ఉన్నందున దానికి ఆ పేరు పెట్టిన‌ట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు