ముగ్గురు మంత్రుల పీఎస్‌ల నియామకం నిలిపివేత

17 Jun, 2014 00:59 IST|Sakshi

నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం అవసరమన్న సిబ్బంది శాఖ
యూపీఏ మంత్రుల వద్ద పనిచేసిన వారి పునర్నియామకంపై విముఖం!

 
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా ముగ్గురు కేంద్రమంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల (పీఎస్‌ల) నియామకాన్ని ప్రభుత్వం నిలిపివేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. మంత్రులకు సంబంధించి వ్యక్తిగత కార్యదర్శులు, ప్రత్యేక విధిలో అధికారులు సహా వ్యక్తిగత సిబ్బంది నియామకాలన్నిటికీ కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం అవసరమని సిబ్బంది శాఖ సర్క్యులర్ జారీ చేసిన నేపధ్యంలో.. ఈ ముగ్గురు కేంద్రమంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల నియామకాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. సిబ్బంది, శిక్షణ శాఖ గత నెల 26వ తేదీన అన్ని శాఖల కార్యదర్శులకూ ఈ సర్క్యులర్‌ను పంపించింది. అన్ని మంత్రిత్వ శాఖలూ, విభాగాలూ అన్ని నియామకాలకూ ఈ విధానాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది. రాజ్‌నాథ్‌సింగ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అలోక్‌సింగ్‌ను ప్రతిపాదించారు. ఆయన గత యూపీఏ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

ఖుర్షీద్ జలవనరుల శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అలోక్‌సింగ్ ఆయనకు ప్రైవేటు సెక్రటరీగానే పనిచేశారు. అలోక్‌సింగ్ పదవీ కాలం వచ్చే ఫిబ్రవరి 14 వరకూ ఉంది. ఈ అంశంపై సిబ్బంది శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. గత ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖల్లో సిబ్బందిగా పనిచేసిన అధికారులను తిరిగి నియమించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం సుముఖంగా లేదని ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి. అలాగే.. హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు వ్యక్తిగత కార్యదర్శిగా అభినవ్‌కుమార్, విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.కె.సింగ్ వ్యక్తిగత కార్యదర్శిగా రాజేశ్‌కుమార్‌ల నియామకం కూడా సందిగ్ధంలో పడింది. అభినవ్ గత ప్రభుత్వంలో శశిథరూర్‌కు, రాజేశ్‌కుమార్ గత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి చంద్రేశ్‌కుమారి కటోచ్‌కు వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేశారు.
 
 
 

మరిన్ని వార్తలు