కరోనా క్యాపిటల్​గా ఢిల్లీ: 3 కారణాలు

27 Jun, 2020 17:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘దేశ రాజధానిలో కరోనా సోకిన బాధితుల పరిస్థితి జంతువుల కంటే అధ్వానంగా ఉంది’ అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు అక్కడి వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కామెంట్ ఊరికే ఏమీ చేయలేదు. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోయాయి. పేషెంట్లకు తగినంత మంది డాక్టర్లు లేరు. అత్యవసర పరిస్థితిలో ఆదుకోవడానికి సరిపడే వనరులూ లేవు. జూన్ 22 నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఢిల్లీలో పది వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో కోవిడ్ కేసుల్లో ఒకటో స్థానంలో ఉన్న ముంబైను దేశ రాజధాని అధిగమించింది. కొత్త కేసుల పెరుగుదలకు పెరిగిన టెస్టింగ్ వేగం కారణమని భావించినా, గడచిన పక్షం రోజులను పరిశీలిస్తే మాత్రం ఢిల్లీ పీకల్లోతు మునిగిపోయిందని అర్థమవుతుంది. దేశ రాజధానిలో పరిస్థితి చేయి జారిపోతుందన్న విషయాన్ని అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం కరోనాను అడ్డుకునేందుకు రంగంలోకి దిగింది. (కేంద్రానికి కృతజ్ఞతలు: కేజ్రీవాల్‌)

వారాల్లో మారిపోయిన పరిస్థితులు
ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) ముందు నుంచి పెద్ద ఎత్తున కరోనాను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. లాక్​డౌన్ కాలంలో హెల్త్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​తో పాటు కాంటాక్టు ట్రేసింగ్, టెస్టుల సామర్ధ్యం పెంచుకునేందుకు ప్రయత్నించింది. కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. ఢిల్లీ జనాభా కోటిన్నర కాగా జూన్ 15 నాటికి అక్కడి ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ల సంఖ్య ఎనిమిది వేలంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైంది. ఫలితంగా అక్కడి వైద్య వ్యవస్థ రోగుల తాకిడిని తట్టుకోలేక విలవిల్లాడుతోంది. (‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’)

రాజకీయ కారణాలు
కరోనా లాంటి విపత్తును ఎదుర్కొవడంలో ఢిల్లీ విఫలం కావడానికి మరో కారణం పాలన. ఇది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఒక పని జరగాలంటే రకరకాల అథారిటీలు దాన్ని ఆమోదించాలి. వైద్యానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఢిల్లీ గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఒకదాన్ని ఇంకొకటి సమన్వయం చేసుకుని పని చేయాలి. ఇక్కడే పెద్ద తలనొప్పి వచ్చి పడింది. కేంద్రం ఎయిమ్స్, సప్ధార్​జంగ్, ఆర్ఎంఎల్ ఆసుపత్రులను నిర్వహిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ది హిందూ రావు, రాజన్ బాబు టీబీ హాస్పిటల్ తదితర మేజర్ ఆసుపత్రులు నడుస్తున్నాయి. ఢిల్లీ గవర్నమెంటు చేతిలో కేవలం రెండు మేజర్ ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయి.

కేంద్రం, మున్సిపాలిటీలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఆప్ ఉండటం వల్ల కరోనా పోరాటంలోకి పాలిటిక్స్ రంగ ప్రవేశం చేశాయి. అందరి నుంచి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో దూషణలు, ఆరోపణలు పెరిగిపోయాయి. ఢిల్లీ ప్రభుత్వం, కార్పొరేషన్ మధ్య కరోనాకు సంబంధిత మరణాలు, పేషెంట్ల బెడ్ల వివరాలపై కొన్ని వారాల పాటు మాటల యుద్ధం నడిచింది. ఈలోగా మహమ్మారి ఢిల్లీ అంతటా చాప కింద నీరులా పాకేసింది.

దాదాపు మూడు నెలల లాక్​డౌన్​ తర్వాత కూడా ఢిల్లీ కార్పొరేషన్ ఆసుపత్రులు కరోనా పేషెంట్ల కోసం సరైన వసతులు ఏర్పాటు చేయలేదు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసింది. ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు జారీ చేసిన ఆర్డర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమన్వయ లోపాన్ని ఎత్తి చూపుతోంది.

హెల్త్​కేర్ ను పట్టించుకున్నది ఎవరు?
ఢిల్లీలో హెల్త్​కేర్ సిస్టంపై కొద్దో గొప్పో శ్రద్ధ చూపింది ఆమ్ ఆద్మీ పార్టీనే. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాకే మొహల్లా క్లినిక్స్, పాలీ క్లినిక్స్, ఉచిత మెడిసిన్ సదుపాయం కల్పించింది. పేదలకు 30 రకాల ప్రాణాంతక వ్యాధులకు ఉచితంగా సర్జరీలు చేయిస్తోంది. 2015 నుంచి 2019 మధ్య ఆప్ ప్రభుత్వం హెల్త్​కేర్ బడ్జెట్ ను డబుల్ చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో హెల్త్​కేర్​పై ఖర్చు చేస్తున్న సగటుతో పోల్చితో ఢిల్లీ కేటాయింపులు అధికం. అయితే, బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ ప్రైమరీ హెల్త్​కేర్​ను ఉద్దేశించి చేసినవి.

ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్లు ఢిల్లీ హెల్త్​కేర్ రంగంలో ఆప్​ సర్కారు సమూల మార్పులేమీ తీసుకురాలేదు. 2015లో ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య 30 వేలకు పెంచుతామని ఆప్ వాగ్ధానం చేసింది. 2020 నాటికి 38 ఆసుపత్రుల్లో కేవలం 394 బెడ్లు మాత్రమే ఉన్నాయి. కేంద్రం కొన్ని అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ఆసుపత్రుల నిర్మాణంలో జాప్యం జరగుతున్నా, ఆప్ పార్టీ ఫెయిల్యూర్ కూడా ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఇటీవల విడుదలైన ‘ది స్టేట్ ఆఫ్ హెల్త్ ఇన్ ఢిల్లీ’ రిపోర్టులో దేశ రాజధానిలో 66 శాతం మెడికల్ లెక్చరర్లు, 34 శాతం మెడికల్ స్టాఫ్, 29 శాతం పారామెడికల్ స్టాఫ్ కొరత ఉంది. ఆసుపత్రుల్లో పాలనపరంగానూ ఉద్యోగుల కొరత ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. మెడికల్, పారామెడికల్ సిబ్బంది తగినంతగా లేకపోవడం కూడా కరోనాను కంట్రోల్ చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలం కావడానికి ఒక కారణం.

>
మరిన్ని వార్తలు