తుని-కొత్తవలస రైల్వే లైన్‌ ప్రాజెక్ట్‌ రద్దు

20 Jul, 2018 20:08 IST|Sakshi

రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : తుని-కొత్తవలస బ్రాడ్‌గేజ్‌ రైల్వే ప్రాజెక్టుకు రైల్వే బోర్డు మంగళం పాడేసింది. ఈ ప్రాజెక్ట్‌ ఎంతమాత్రం గిట్టుబాటు కాదని రైల్వే బోర్డు అభిప్రాయపడినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్‌ గోహెయిన్‌ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, తుని-కొత్తవలస ఇప్పటికే విద్యుద్దీకరణ చేసిన డబుల్‌ లైన్‌తో అనుసంధానం అయింది. అయినప్పటికీ తుని-కొత్తవలస వయా నర్సీపట్నం, మాడుగుల మధ్య 155.34 కి.మీ దూరం సింగిల్‌ లైన్‌ రైల్‌ మార్గం నిర్మాణం కోసం సర్వే నిర్వహించినట్లు చెప్పారు.

ఈ రైల్‌ మార్గం నిర్మాణానికి సుమారు 3771.21 కోట్లు ఖర్చు అవుతుందని తేలింది. ప్రస్తుతం తుని-కొత్తవలస మధ్య ఉన్న డబుల్‌ లైన్‌ వినియోగ సామర్ధ్యం 46 నుంచి 122 శాతం ఉండగా, తుని-కొత్తవలస మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వే మార్గంలో అతి తక్కువ ట్రాఫిక్‌ కారణంగా పెట్టుబడులపై రాబడి పూర్తిగా నెగెటివ్‌లో ఉన్నట్లు సర్వే వివరాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత రైల్వే బోర్డు అభిప్రాయపడింది. అందుకే ఈ కొత్త రైల్వే లైన్‌ ఆర్ధికంగా గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో ప్రాజెక్టును రద్దు చేయడం జరిగిందని మంత్రి వివరించారు.

ధాన్యం సేకరణ విషయంలో ఏపీ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తమ దృష్టికి రాలేదని ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ధాన్యసేకరణ కేంద్రాలంలో ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా రబీ సీజన్‌లో ధాన్యం రైతులను మిల్లర్లు, దళారీలు పీల్చుకు తింటున్న విషయం వాస్తవమేనా? అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ధాన్యం సేకరణలో తేమ పరిమితులు, ఇంకా ఇతరత్రా నిబంధనలను పాటించకపోవడం వల్ల రాష్ట్ర రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు ఏవీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాలేదని చెప్పారు.

ధాన్యం సేకరణకు సంబంధించినంత వరకు ఏపీ డీసెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌(డీసీపీ) రాష్ట్ర జాబితాలో ఉంది. అందువలన రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అవుతుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద సంబంధిత రాష్ట్రం అవసరాలు తీరిన తర్వాత మిగిలిన కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌(సీఎంఆర్‌)ను ఇతర రాష్ట్రాల వినియోగం కోసం సెంట్రల్‌ పూల్‌లోని ఎఫ్‌సీఐకి పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తుంది. ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా కనీస మద్ధతు ధర ప్రకారం సొమ్ము చెల్లింపు జరుగుతుందని మంత్రి వివరించారు.

>
మరిన్ని వార్తలు