భూభాగం కోసం పులుల భీకరపోరు!

2 Apr, 2020 08:46 IST|Sakshi
గొడవకు సిద్ధంగా ఉన్న పులులు

భోపాల్‌ : భూభాగం కోసం రెండు పులులు కయ్యానికి కాలు దువ్వాయి. అడవి మొత్తం ప్రతిధ్వనించేలా గాండ్రిస్తూ కుమ్ములాడు కున్నాయి. ఈ సంఘటన చత్తీస్‌ఘడ్‌ - మధ్యప్రదేశ్‌ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌.. భూభాగం కోసం గొడవ పడుతున్న రెండు పులులకు సంబంధించిన వీడియోను బుధవారం తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. టైగర్‌ ప్రాజెక్టు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘ రెండు పెద్ద పులుల మధ్య భూభాగం కోసం గొడవ. హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని వీడియో చూడండి. మధ్య భారతదేశ పులుల శక్తివంతమైన గాండ్రింపులు వినొచ్చు. ఈ రోజుతో ‘ప్రాజెక్టు టైగర్‌’ 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంద’’ని పేర్కొన్నారు.

రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో.. గొడవకు సిద్ధ పడ్డ పులులు మొదట గాండ్రింపులతో ఒకదాన్ని ఒకటి బెదిరించుకున్నాయి. తమ అరుపులతో అడవిని షేక్‌ చేసేశాయి. కొద్దిసేపటి తర్వాత పంజాలు విసురుకున్నాయి. అయితే గెలుపెవరిదన్న విషయం తేలకుండానే గొడవ ముగిసిపోయింది. కాగా, భూభాగం కోసం జరిగే పోరాటాల్లో కొన్నిసార్లు పులులు మృత్యువాత పడే అవకాశం కూడా ఉందని కశ్వాన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు