‘టిక్‌టాక్‌’పై కఠిన చర్యలు ఉంటాయా?

26 Aug, 2019 19:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అనతి కాలంలోనే కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంటున్న మినీ వీడియో యాప్‌ ‘టిక్‌టాక్‌’ కోసం పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో గత వారం నూర్‌ అన్సారీ, అతని మిత్రులు వీడియో క్లిప్‌ను తీయడంలో నిమగ్నమయ్యారు. తమ మీదకు రైలు దూసుకొస్తోందన్న విషయాన్ని కూడా వారు గమనించలేక పోయారు. పాపం! ఆ ప్రమాదంలో అన్సారీ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆయన మిత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇలా అనవసరమైన రిస్క్‌లకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. బెంగళూరుకు సమీపంలోకి ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల కుమార్‌ అనే యువకుడు వీడియో కోసం జూన్‌ 15వ తేదీన వెనక్కి పల్టీ కొడితే వెన్నుపూస విరిగి పోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రాణమే పోయింది. రాజస్థాన్‌లోని కోటా సిటీలో ఆరవ తరగతి చదువుతున్న ఓ 12 ఏళ్ల బాలుడు ‘టిక్‌టాక్‌’ కోసం బాత్‌రూమ్‌ డోర్‌ మీదున్న నెక్లస్‌ తీసుకొని మెడలో వేసుకోగా, నెక్లస్‌ కొన బాత్‌రూమ్‌ డోర్‌కు ఇరుక్కు పోవడంతో నెక్లస్‌ మెడకు బిగుసుకొని ఊపరాడక చనిపోయారు. న్యూఢిల్లీలో ఏప్రిల్‌ 14వ తేదీన ఓ యువకుడు టిక్‌టాక్‌ వీడియో కోసం తన మిత్రుడి ముఖం మీద ప్రమాదవశాత్తు కాల్చడంతో 19 ఏళ్ల సల్మాన్‌ జకీర్‌ మరణించారు. తమిళనాడులోని తంజావూర్‌లో ఫిబ్రవరి 23వ తేదీన ముగ్గురు విద్యార్థులు టిక్‌టాక్‌ వీడియో కోసం బైక్‌ నడపుతుండగా ఓ బస్సు వచ్చి ఢీకొనడంతో అందులో ఒక విద్యార్థి మరణించగా, ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.

ఇలా టిక్‌టాక్‌ వీడియోలు తీస్తూ దేశంలో ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారో కచ్చితంగా లెక్కించలేం. ఓ యాభై మంది వరకు మరణించి ఉండవచ్చునేమో! సెల్ఫీలు దిగుతూ మరణించిన వారి సంఖ్య ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే ఎక్కువ. 2011 నుంచి 2017 మధ్య కాలంలోనే 159 మంది అలా మరణించినట్లు ఓ అధ్యయనంలో తేల్చారు. ‘బైట్‌డాన్స్‌’ అనే చైనా కంపెనీకి చెందినది ‘టిక్‌టాక్‌’. దీనికి భారత్‌లో 12 కోట్ల మంది చురుకైన యూజర్లు ఉన్నారు. డౌన్‌లోడ్లకు సంబంధించి కూడా భారత్‌లో ఇది టాప్‌ యాప్‌. 50 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగారులున్న భారత్‌లో ‘టిక్‌టాక్‌’కు ఎక్కువ మార్కెట్‌ ఇక్కడే జరుగుతోంది. ‘హెలో’ యాప్‌ ద్వారా కూడా (భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లు) భారతీయులను విశేషంగా ఆకర్షిస్తోన్న బైట్‌డాన్స్‌ కంపెనీ త్వరలోనే భారత్‌లో అంతర్జాతీయ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. భారతీయుల డేటాకు గ్యారంటీ ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆ కంపెనీని నిలదీయడంతో చైనా కంపెనీ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ అమెరికా, సింగపూర్‌ సర్వర్లలో డేటాను నిక్షిప్తం చేస్తోంది.

ప్రాచుర్యం పొందిన సినిమా పాఠాలకు, సన్నివేశాలకు లిప్‌ మూవ్‌మెంట్‌ను అందిస్తూ, డ్యాన్సులు చేస్తూ తమ దైన శైలిలో ఈ టిక్‌టాక్‌ ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అనవసరంగా కొందరు యూజర్లు సాహసాలకు, విన్యాసాలకు పోయి విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పోర్నో వీడియోల షేరింగ్‌ ద్వారా ఈ యాప్‌ పిల్లలను చెడగొడుతోందని ఆగ్రహించిన మద్రాస్‌ హైకోర్టు దీనిపై ఇటీవల నిషేధం కూడా విధించింది. దీనివల్ల పోతున్న ప్రాణాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే టిక్‌టాక్‌పై మరిన్ని కఠిన చర్యలు తప్పకపోవచ్చు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు