ఇక టిక్‌టాక్‌ యాప్‌ పనిచేయదు

30 Jun, 2020 18:50 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్‌ యాప్‌లపై కేంద్రం సోమవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్‌ ప్లే స్టోర్,యాప్‌ స్టోర్‌ల‌లో టిక్‌టాక్‌తో పాటు మిగిలిన కొన్ని యాప్‌లను తొలగించారు. మరోవైపు ఆయా ఫోన్లలో ఇన్​స్టాల్ అయి ఉన్న యాప్స్‌ మాత్రం మామూలుగా పనిచేస్తూ వచ్చాయి. అయితే కొద్దిసేపటి నుంచి మొబైల్‌ ఫోన్లలో, డెస్క్‌టాప్‌ వర్షన్‌లో టిక్‌టాక్‌ యాప్‌ సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా టిక్‌టాక్‌ యాప్‌ పూర్తిగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయింది. టిక్‌టాక్‌ యాప్‌ ఓపెన్‌ చేస్తున్న వినియోగదారులకు.. నెట్‌వర్క్‌ ఎర్రర్‌ కనిపిస్తుంది. (చదవండి : టిక్‌టాక్‌పై నిషేధం)

అలాగే యాప్‌ ఓపెన్‌ చేసేవారికి ‘భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌లపై నిషేధం విధించింది. మేము భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటించే పనిలో ఉన్నాం. అలాగే సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి, పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఇండియాలో ఉన్న మా వినియోగదారుల భద్రత మాకు అత్యంత ప్రధానమైంది’ అనే సందేశం కనిపిస్తుంది. మరోవైపు భారత్‌లో తమ యాప్‌ను నిషేధించడంపై టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ స్పందిస్తూ.. తమ వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చారు.  భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా  హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు.(చదవండి : నిషేధంపై టిక్‌టాక్ స్పందన)

మరిన్ని వార్తలు