ఊపిరి పీల్చుకున్న టిక్‌టాక్

28 May, 2020 17:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్ర‌పంచానికి క‌రోనా దెబ్బ తాకితే, టిక్‌టాక్‌కు క్యారిమీన‌టి దెబ్బ త‌గిలింది. దీంతో టాప్ రేటింగ్‌లో దూసుకుపోయిన టిక్‌టాక్ 1 స్టార్ రేటింగ్‌కు ప‌డిపోయింది. ఇక టిక్‌టాక్‌కు రోజులు చెల్లిపోయాయి, ఇప్పుడో, అప్పుడో యాప్ కూడా క‌నిపించ‌కుండా పోతుంద‌ని ఎంతో మంది అనుకుంటూ వ‌చ్చారు. అయితే ఈ త‌తంగాన్ని అంత‌టినీ నిశితంగా ప‌రిశీలిస్తోన్న గూగుల్ దారుణ‌మైన రేటింగ్ ఇచ్చిన ఎనిమిది మిలియ‌న్ల నెగెటివ్ రివ్యూలపై వేటు వేసింది. దీంతో అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ప్లేస్టోర్‌లో టిక్‌టాక్ 4.4 స్టార్ రేటింగ్‌తో తిరిగి యథాస్థితికి చేరుకుంది. ఊహించ‌ని ప‌రిణామానికి యూట్యూబ్ అభిమానులు నోరెళ్ల‌బెడుతున్నారు. ఇంత‌కీ ఈ గొడ‌వ‌లో గూగుల్ మ‌ధ్య‌లో ఎందుకొచ్చిందంటే.. అందరూ ఈ యాప్‌కు రేటింగ్‌, రివ్యూలు ఇస్తోంది గూగుల్ ప్లే స్టోర్‌లోనే. కాగా టిక్‌టాక్‌కు నెగెటివ్‌గా ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన చాలామంది త‌మ రివ్యూల్లో దానికి గ‌ల అస‌లు కార‌ణాన్ని వెల్ల‌డించ‌లేదు. (యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌: గెలుపెవ‌రిది?)

పైగా ఆ యాప్‌కు సంబంధం లేకుండా ఇష్టారీతిన స‌మీక్ష‌లు ఇచ్చారు. దీంతో వీట‌న్నింటిపై దృష్టి సారించిన గూగుల్ అసంబ‌ద్ధంగా ఉన్న రివ్యూల‌న‌న్నింటినీ తొల‌గించాల‌ని నిర్ణ‌యించుకుంది. సుమారు ఎనిమిది మిలియ‌న్ల రివ్యూల‌ను తీసివేసిన‌ట్లు తెలుస్తోంది. రివ్యూల దుర్వినియోగాన్ని త‌గ్గించేందుకే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు గూగుల్ త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్థించుకుంది. కాగా యూట్యూబ్‌, టిక్‌టాక్‌ల మ‌ధ్య ఓమోస్త‌రు యుద్ధ‌మే నడిచిన విష‌యం తెలిసిందే. భార‌తీయ యూట్యూబ్ అభిమానులు టిక్‌టాక్‌ను దేశంలో బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు. అంతిమంగా దారుణ రేటింగ్స్‌తో టిక్‌టాక్ క్రేజ్ అమాంతం ప‌డిపోయింది. (ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ)

మరిన్ని వార్తలు