సోషల్ మీడియా, ఫేక్ వీడియోల మాయలో పడకండి!

3 Apr, 2020 12:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న  నకిలీ వీడియోలు 

వాట్సాప్, టిక్ టాక్  ద్వారా ఫేక్ న్యూస్ హల్ చల్

ముస్లిం సమాజమే టార్గెట్ గా  నకిలీ వీడియోలు

సాక్షి, న్యూ ఢిల్లీ: సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, నకిలీ సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వదంతులకు అడ్డుకట్ట పడడంలేదు. ముఖ్యంగాం  కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన పెరుగుతున్న క్రమంలో ఇలాంటి అవాంఛనీయ ధోరణి పెరుగుతుండటం కలవరం పుట్టిస్తోంది. వైరస్ వ్యాప్తిని  నిరోధించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఆంక్షల సమయంలో కూడా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో నకిలీ సమాచారంతో పలు వీడియోలు  హల్ చల్ చేస్తున్నాయి ఇలాంటి వీడియోలను నమ్మవద్దని, నకిలీ వార్తల పట్ల జాగ్రత్తగా వుండాలని ఢిల్లీ పోలీసులు  స్పందించారు.  ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గత ఐదు రోజులుగా ఓ వర్గానికి చెందిన ప్రజలను లక్ష్యంగా సోషల్ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఈ ధోరణి బాగా పెరిగింది. దీంతో వైరలవుతున్న 30 వేలకు పైగా వీడియోలను నిపుణులు విశ్లేషించారు. హిందీ, ఉర్దూ భాషల్లో తప్పుడు సమాచారంతో అనేక  పోస్టులను గుర్తించారు. 

చేతులు పదే పదే కడుక్కోవద్దు, మాస్క్ లు ధరించవద్దు, భౌతిక దూరాన్ని పాటించవద్దు, వ్యాధిని విరివిగా వ్యాప్తి చేయండి. అంటూ ముస్లింలకు  తప్పుడు సలహా ఇస్తున్న భయంకరమైన  ఫేక్ వీడియోలు షేర్ అవుతున్నాయని, వీటి మాయలో పడకుండా, అప్రతమత్తంగా ఉండాలని  సీనియర్ పోలీసు అధికారి  ఒకరు తెలిపారు. ముఖ్యంగా  చైనాకు చెందిన యాప్  టిక్‌టాక్ ద్వారా  ఇవి బాగా వ్యాప్తి చెందుతున్నాయని, అనంతరం ఈ వీడియోలు వాట్సాప్, ఫేస్‌బుక్,  ట్విటర్లలో విరివిగా షేర్ అవుతున్నాయని వెల్లడించారు. 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అనంతరం మొదటివారంలో వాట్సాప్, టిక్ టాక్ వంటి యాప్ లలో మతపరమైన విద్వేషంతో, మత నాయకులపై ఆరోపణలతో, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక వీడియోలను కనుగొన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కరోనా వైరస్  అడ్డుకునే రోగనిరోధక శక్తిని ముస్లింలకు వుంటుందనీ, కనుక వారు భౌతిక దూర నియమాలను పాటించవద్దనే  తప్పుడు సమాచారంతో ప్రజలకు సలహా ఇచ్చే వీడియోలు ఇందులో ప్రముఖంగా ఉన్నాయన్నారు. దీంతో మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇవి తీవ్రమైన సవాలుగా పరిణమించాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్దిష్ట ప్రేక్షకుల కోసం ఎక్కువగా హిందీ, ఉర్దూ భాషల్లో నకిలీ సమాచారం, వీడియోలు సృష్టించినట్లు  తెలిపారు. ఈ వీడియోలు చాలావరకు పాకిస్తాన్  మిడిల్ ఈస్ట్ లలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోందనీ, అయితే భారతదేశంలో షూట్ చేసినట్టుగా సూపర్ ఇంపోజ్ చేస్తున్నారన్నారు. భద్రతా పరిశోధకులు, ఫ్యాక్ట్ చెకర్స్. డేటా ఎనలిస్టుల సహాయంతో ఈ వీడియోలను  విశ్లేషించామన్నారు.  అయితే కోటిగా పైగా ప్రజలు ఇప్పటికే ఈ వీడియోలను వీక్షించారని పేర్కొన్నారు. చాలావరకు ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో వీటిని సృష్టించి , సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేస్తున్నారని  తెలిపారు. ఇలాంటి వీడియోలను గుర్తించి, సంబంధిత ఖాతాలను తొలగిస్తున్నామని చెప్పారు.  అయితే ఫేక్ వీడియోల వ్యాప్తిలో విదేశీయుల పాత్రపై మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వైద్య సిబ్బందిపై దాడులు, ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారివల్లేనన్న అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో  పోలీసులు తాజా నివేదికలను వెలువరించారు. ఇలాటి తప్పుడు సమాచారం, వీడియోల వ్యాప్తి ముస్లింలను తోటి ముస్లింల నుండి దూరంగా ఉంచే కుట్రగా పేర్కొన్నారు. మరోవైపు మౌలానా సాద్ కంధల్వి అధికారికంగా ఒక తన అనుచరులనుద్దేశించి ఆడియో సందేశాన్ని జారీ చేశారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో ప్రభుత్వంతో అందరూ సహకరించాలని కోరారు. జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల మార్గదర్శకత్వాలను పాటించాలని, ప్రజలు సమూహాలుగా రాకుండా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధం ఎంతమాత్రం కాదని ఆయన పేర్కొన్నారు.  కాగా ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చాలా పరిమితంగా  ఉన్నప్పటికీ,  దేశవ్యాప్తంగా  వైరస్ బాధితుల  సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు