సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు గుడ్‌బై

10 Sep, 2019 04:00 IST|Sakshi

ప్రధాని మోదీ పిలుపు

2030 నాటికి 2.6 కోట్ల హెక్టార్ల భూమిని సాగులోకి తెస్తాం

కాప్‌–14 సదస్సు

గ్రేటర్‌ నోయిడా: ప్రపంచదేశాలన్నీ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (ఎస్‌యూపీ)కి ఇక గుడ్‌ బై చెప్పే సమయం వచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీడు భూముల్ని సాగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి కూడా ఆయన వివరించారు.  ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి (యూఎన్‌సీసీడీ) కాప్‌14 సదస్సుకి ఈ సారి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న ఈ సదస్సులో 200 దేశాలకు చెందిన ప్రతినిధులనుద్దేశించి సోమవారం ప్రధాని ప్రసంగించారు.

ఒకసారి మాత్రమే వినియోగించాల్సిన ప్లాస్టిక్‌ను  వచ్చే కొద్ది సంవత్సరాల్లో భారత్‌లో పూర్తిగా  నిర్మూలిస్తామని ప్రధాని చెప్పారు. ‘ప్లాస్టిక్‌ వినియోగం పెరిగే కొద్దీ పచ్చని భూములు కూడా ఎడారులుగా మారిపోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు మన భూముల్ని ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి వెలువడే కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎటుచూసినా కుప్పులు తెప్పలుగా పేర్కొంటున్న ప్లాస్టిక్‌ భూముల్ని నాశనం చేసి వ్యవసాయాన్ని దెబ్బ తీస్తోంది‘‘ అని మోదీ చెప్పారు. ప్రపంచదేశాలన్నీ కూడా ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం విధించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

భూముల క్షీణతపై ఆందోళన
పర్యావరణంలో వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని ప్రధాని అన్నారు. వాతావరణం వేడెక్కడంతో కాలం కాని కాలంలో వర్షాలు కురవడం, తుపాన్లు ముంచెత్తడం, సముద్ర మట్టాలు పెరిగిపోవడం వంటి వాటితో భూముల్ని కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భూమిలో సారాన్ని పెంచాలంటే, వ్యవసాయానికి అనుగుణంగా వాటిని మార్చాలంటే నీటి సరఫరాలో పక్కా వ్యూహాలను అనుసరించాలి. బీడు భూములకి నీటి వసతిని కల్పించాల్సిన అవసరం ఉంది‘ అని మోదీ అన్నారు.

2015–17 మధ్య కాలంలో భారత్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 8 లక్షల హెక్టార్లకు పెరిగిందని వెల్లడించారు. 2030 నాటికి 2.1 కోట్ల హెక్టార్ల నుంచి 2.6 కోట్ల హెక్టార్ల భూముల్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూముల్ని పునరుద్ధరించడానికి రిమోట్‌ సెన్సింగ్, స్పేస్‌ టెక్నాలజీని వినియోగిస్తోందన్నారు. ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఈ సదస్సు ఈనెల 2 నుంచి 13 వ తేదీ వరకు జరగనుంది.

>
మరిన్ని వార్తలు