వేధింపులు తట్టుకోలేక...

12 Dec, 2015 14:51 IST|Sakshi
వేధింపులు తట్టుకోలేక...

న్యూఢిల్లీ: వేధింపులను తట్టుకోలేక జాతీయస్థాయి వర్ధమాన క్రీడాకారిణి అర్జు ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థి, బంధువు కూడా అయిన దీపేశ్ శంకర్ అనే యువకుడి వేధింపులను భరించలేక ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి దీపం, క్రీడాజ్యోతి ఆరిపోయిందని అర్జు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.

అర్జు తల్లిదండ్రులిద్దరూ ఉన్నతోద్యోగులు. అన్న శివం డాక్టర్ వృత్తిలో వున్నాడు. చిన్నప్పటినుంచి ఆమెకు బాస్కెట్ బాల్ అంటే ప్రాణం. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే కెప్టెన్గా ఎదిగింది. ఇటీవల గుజరాత్ లో జరిగిన జాతీయ బాస్కెట్ బాల్ పోటీల్లో తన జట్టును రెండవ స్థానంలో నిలిపింది. భవిష్యత్తు మరింత ఎత్తుకు ఎదగాలని కలలు కంది. కానీ ఓ మృగాడి రూపంలో విధి ఆమెతో ఆడుకుంది.

అర్జును తరచూ వేధించే దీపేశ్ శుక్రవారం ఇంటికి వచ్చి మరీ గొడవ పడ్డాడు. సోదరుడు శివం అడ్డుకోవడంతో ఇద్దరి మధ్యా తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో శివం ఫిర్యాదు చేశాడు.  ఈ మొత్తం వ్యవహారంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అర్జు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మరిన్ని వార్తలు