మంత్రుల రహస్య పర్యటనలు.. ఎందుకో!

5 May, 2017 08:49 IST|Sakshi
మంత్రుల రహస్య పర్యటనలు.. ఎందుకో!

'ఎబార్ బంగ్లా'... అంటూ అమిత్ షా కంఠం ఖంగుమంటూ మోగింది. దేశవ్యాప్త పర్యటనకు గత నెలలో కోల్‌కతాలో శ్రీకారం చుట్టినప్పుడు అక్కడున్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దాంతో ఒక్కసారిగా టీఎంసీ కలవరపడింది. గురువారం నాడు టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ దానిమీద స్పందించారు. ఆయన స్పందన ఎలా ఉన్నా.. పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలోని కొంతమంది సభ్యులు సహా ఇటీవలి కాలంలో పలువురు టీఎంసీ సీనియర్ నాయకులు రహస్యంగా లక్నోకు వెళ్లి వస్తున్నారు. ఎందుకా అన్న విషయం చాలాకాలం పాటు ఎవరికీ అర్థం కాలేదు.

చివరకు తేలింది ఏంటయ్యా అంటే.. గతంలో పశ్చిమబెంగాల్‌లో చురుగ్గా వ్యవహరించిన బీజేపీ నాయకుడు ఒకరు ఇటీవలే లక్నోకు వెళ్లిపోయారట. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన అక్కడకు వెళ్లారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నారద స్టింగ్ ఆపరేషన్ కేసును, శారదా చిట్‌ఫండ్ స్కాం కేసును తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ రెండు కేసులను వదిలేది లేదని స్పష్టం చేస్తోంది. దాంతో ఎలాగోలా ఆ బీజేపీ పెద్దాయనను ప్రసన్నం చేసుకుని ఆ కేసుల నుంచి బయటపడాలన్నది టీఎంసీ నాయకుల ఉద్దేశంలా కనిపిస్తోంది. అవసరమైతే.. టీఎంసీ నుంచి బయటపడి, బీజేపీలో చేరిపోతామని కూడా వాళ్లు రాయబారాలు నడుపుతున్నారట. కానీ.. బీజేపీ మాత్రం మచ్చపడ్డ నాయకులను తీసుకునేది లేదని తెగేసి చెబుతోంది. 'నో నారదా - శారదా ఇన్ బీజేపీ' అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ రెండు కేసులను సీబీఐ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో సుప్రీంకోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసేశారు. ఈ స్కాంను బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ నేతృత్వంలో ఉన్న పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. స్కాంలో పాత్ర ఉందని తెలిస్తే ఎంపీల మీద కూడా గట్టి చర్యలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అస్త్రం బీజేపీకి 2019 ఎన్నికల్లో బాగా ఉపయోగపడేలా కనిపిస్తోంది. బెంగాల్‌లో అధికారం చేపట్టేంత పరిస్థితి లేకపోయినా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగితే చాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇటీవల అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ రెండో స్థానంలో నిలవగా.. వామపక్షాలు, కాంగ్రెస్ వరుసగా మూడు, నాలుగు స్థానాలకు పరిమితం అయ్యాయి.

మరిన్ని వార్తలు