తలారి లేడు: నాకు ఆ అవకాశం ఇవ్వండి!

10 Dec, 2019 11:07 IST|Sakshi
సుభాష్‌ శ్రీనివాసన్‌(ఫొటో కర్టెసీ: ఇండియా టుడే)

చెన్నై: నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తీహార్‌ జైలులో తలారి అందుబాటు లేడంటూ వార్తలు ప్రచారమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ సుభాష్‌ శ్రీనివాసన్‌... తనను తాత్కాలిక తలారిగా నియమించాలంటూ తీహార్‌ జైలు డీజీపీకి లేఖ రాశారు. నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం తనకు ఇవ్వాలని లేఖలో కోరారు. ఇందుకోసం తనకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘ మీరు నాకు అప్పగించబోయే ఆ పని ఎంతో గొప్పది. కాబట్టి నాకు అక్కడ పనిచేసే అవకాశం ఇవ్వగలరని కోరుతున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా సుభాష్‌ శ్రీనివాసన్‌ వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం, మంచి నీటి ఉచిత సరఫరా వంటి పలు సామాజిక కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యమయ్యారు.(ఉరితాళ్లు సిద్ధం చేయండి)

ఇక దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా వారి ఉరిశిక్ష అమలు కాకపోవడంపై మహిళా సంఘాలతో సహా.. పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడని, దానిపై రామ్‌నాథ్‌ కోవింద్‌ తుది నిర్ణయం తీసుకున్న అనంతరం శిక్షను అమలు చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే వినయ్ శర్మ తరుఫు న్యాయవాది మాత్రం అతడు క్షమాభిక్ష పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా... నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకై తీహార్‌ జైలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఉరి తీసేందుకు జైలులో తలారి లేరని జైలు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ అవకాశం తనకు ఇవ్వాల్సిందిగా... హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిమ్లాకు చెందిన రవి కుమార్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఒక లేఖ రాశారు.

కాగా 2012, డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఢిల్లీలో ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి కన్నుమూసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు