తమిళనాడు రాజ్‌భవన్‌లో మాంసాహారం నిషేధం

21 Nov, 2017 02:12 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ తన అధికార నివాసమైన చెన్నైలోని రాజ్‌భవన్‌లో మాంసాహారాన్ని నిషేధించారు. కనీసం కోడిగుడ్డు సైతం రాజ్‌భవన్‌లోకి ప్రవేశించరాదని షరతు పెట్టారు. రాజ్‌భవన్‌ సిబ్బంది మాంసాహారం తినాలని భావిస్తే బయటకు వెళ్లి తిని రావాలని గవర్నర్‌ సూచించారు. రాజ్‌భవన్‌కు వచ్చే కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులకు శాఖాహార వంటలే వడ్డించాలని నిర్ణయించారు. గత నెల 6న తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన మహారాష్ట్రకు చెందిన పురోహిత్‌ కొత్త పంథాలో వెళ్తున్నారు.

తనను కలవడానికి రాజ్‌భవన్‌కు వచ్చేవారు పూలమాలలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తేవద్దని సూచించారు. తమిళులతో మరింతగా మమేకమయ్యేందుకు తమిళం నేర్చుకుంటున్నారు. తమిళ అధ్యాపకుడు ఒకరు రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌కు తమిళం నేర్పిస్తున్నారు. రాజ్‌భవన్‌కు పరిమితం కాకుండా కోయంబత్తూరు వెళ్లి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇకపై అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలనలో గవర్నర్‌ జోక్యంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. ప్రజాశ్రేయస్సు కోసమే తన ప్రయత్నమన్నారు.

>
మరిన్ని వార్తలు