జయలలిత నివాసంపై కీలక నిర్ణయం

22 May, 2020 15:16 IST|Sakshi

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసమైన చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని‌ వేద నిలయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జయలలితన నివాసాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోనున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులకు తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ కూడా ఆమోద ముద్ర వేశారు. 

ఈ నివాసానికి సంబంధించి చట్టబద్ధమైన వారసులకు పరిహారం అందజేయకపోవడంతో తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీచేసినట్టు అధికారులు చెప్పారు. వారసులకు కేటాయింపుల కోసం రూ. 66 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఈ బంగ్లాను జయలలిత స్మారక మ్యూజియంగా మార్చనున్నారు. ఈ మ్యూజియం వ్యవహారాలు చూసుకునేందుకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని ఈ ట్రస్ట్‌కు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, సమచార శాఖ మంత్రి కె రాజు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. 

కాగా, జయలలిత బతికి ఉన్న కాలంలో వేద నిలయం రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కూడా ఆమె ఈ బంగ్లా నుంచే చక్రం తిప్పారు. జయలలిత మరణించిన తర్వాత వేద నిలయానికి సంబంధించి వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు