స్టెరిలైట్‌ ప్లాంట్‌ మూసివేత

29 May, 2018 02:57 IST|Sakshi
స్టెరిలైట్‌ ప్లాంటు గేటుకు సీలువేస్తున్న అధికారులు

తమిళనాడు సీఎం ఆదేశాలు

సాక్షి ప్రతినిధి, చెన్నై/తూత్తుకుడి: తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్‌’రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యం వెదజల్లుతున్న ‘స్టెరిలైట్‌’రాగి కర్మాగారాన్ని మూసేయాలని వంద రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకమవడం, పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోవడం తెల్సిందే. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా, సోమవారం కేబినెట్‌ భేటీ అనంతరం ఈ ప్లాంట్‌ను మూసేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ జీవో విడుదలైన వెంటనే ట్యుటికోరిన్‌ జిల్లా అధికారులు స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌కు సీల్‌ వేశారు.   

22 ఏళ్లుగా ఆందోళన
వేదాంత లిమిటెడ్‌కు చెందిన ‘స్టెరిలైట్‌’కంపెనీ తమిళనాడులోని తూత్తుకుడిలో నాలుగు లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో 1996లో ప్లాంటు స్థాపించి రాగిని ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ మైనింగ్‌తో భూగర్భ జలాలు తగ్గుతాయని, ఉద్గారాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని, కేన్సర్‌ వంటి రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్‌ మూసివేతకు అప్పటి సీఎం జయలలిత ఆదేశించారు. ప్లాంటు కాలుష్యంపై తీసుకున్న చర్యలు తెలపాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది.
 

మరిన్ని వార్తలు